లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్, మంత్రులు
ABN , Publish Date - Jan 23 , 2026 | 09:35 AM
మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా లోకేశ్ ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రులు ప్రశంసించారు.
అమరావతి, జనవరి 23: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara lokesh) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. లోకేశ్‌కు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు, అభిమానులు పెద్దఎత్తున బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్‌కు పవన్ విషెస్ తెలిపారు.
పవన్ ట్వీట్..

‘రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావితరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేశ్ ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.
లోకేశ్‌కు హోంమంత్రి విషెస్

మంత్రి నారా లోకేశ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేశ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ‘ముస్తాబు’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నిరంతరం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్ ఆయురారోగ్యాలతో, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హోంమంత్రి అనిత ఆకాంక్షించారు.
యువతకు లోకేశ్ ఆశాజ్యోతి: మంత్రి అనగాని

మంత్రి లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలని అన్నారు. తాత వారసత్వాన్ని, తండ్రి విజనరీని పుణికిపుచ్చుకున్న నేత లోకేశ్ అని తెలిపారు. రాష్ట్రంలోని యువత స్వప్నాల సాధకుడు నారా లోకేశ్ అని పేర్కొన్నారు. తన శాఖలైన విద్య, ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకొస్తున్నారని.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిస్పృహలోకి వెళ్లిన యువతకు లోకేశ్ ఆశాజ్యోతిగా నిలిచారని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
యువతేజం లోకేశ్..: ఎంపీ శివనాథ్

మంత్రి లోకేశ్‌కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదులు వేస్తున్న యువ నాయకుడు నారా లోకేశ్ అని అన్నారు. మంత్రి లోకేశ్‌తోనే విద్యా వ్యవస్థలో సాధ్యమైన విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దేందుకు లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి రథసారథిగా అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రతిక్షణం శ్రమిస్తున్న ప్రజాసేవకుడు లోకేశ్ అని కొనియాడారు. రాష్ట్రంలోని యువతకు అత్యున్న ఉపాధి అవకాశాలు అందించాలని ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్న యువతేజం లోకేశ్ అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సిట్ విచారణకు కేటీఆర్.. తెలంగాణ భవన్‌కు తరలి వస్తున్న పార్టీ శ్రేణులు
మీ పక్కన నడవడం గర్వంగా ఉంది: నారా బ్రాహ్మణి
Read Latest AP News And Telugu News