శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:02 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్‌కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు..
పశ్చిమగోదావరి జిల్లా, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి లడ్డూను కల్తీ చేసిన జగన్‌కి తిరుపతి పేరు ఎత్తే అర్హత లేదని ధ్వజమెత్తారు. లడ్డూలో కలిసింది రసాయనాల మిశ్రమాలు తప్ప.. నెయ్యి లేదని సీబీఐ తన ఛార్జిషీట్‌లో ప్రస్తావించినా.. ఏ మొహం పెట్టుకొని ఆయన ఇంకా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళల ఆర్థిక ఆభివృద్ది కోరుకుంటూ స్వర్గీయ ఎన్టీఆర్ వారిని ఎంతో ప్రోత్సహించారని తెలిపారు.
దివ్యాంగులపై కనికరం చూపలేదు..
దివ్యాంగులపై సైతం వైసీపీ ప్రభుత్వం కనికరం చూపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులందరికీ పింఛన్లని అందిస్తోందని వివరించారు. ఇవాళ (ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో రూ. 58 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమ కోసం నిరంతరం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. రాజధాని నిర్మాణంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
రూ. 240 కోట్ల కుంభకోణం..
తిరుపతి లడ్డూ తయారీలో రూ. 240 కోట్ల కుంభకోణం జరిగిందని సీబీఐ తన చార్జిషీట్‌లో ప్రస్తావించిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తిరుమలకు ఇండో కోర్ కంపెనీ నుంచి కేవలం పన్నీరు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తిరుపతిలో డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తిరుమల వెళ్లడం మానేశారని ఆరోపించారు. అసలు నెయ్యే లేకుండా కేవలం రసాయనాలు కలిపి వైసీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు.
ఆ నిబంధన ఉంది..
హెరిటేజ్ కంపెనీ నుంచి దేవాలయాలకు, ప్రభుత్వానికి ఎలాంటి ప్రొడక్ట్స్ సరఫరా చేయకూడదనే నిబంధన ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పన్నీర్‌కి, నెయ్యికి తేడా తెలీని జగన్.. తాను చేసిన తప్పులను ఇతరులపై నెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అసలు నెయ్యి లేకుండా రసాయన మిశ్రమం కలిపి లడ్డూను అపవిత్రం చేసిన జగన్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..
ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News