Share News

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:42 PM

నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..
Tragic Incident

నాగర్‌కర్నూల్ జిల్లా, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో ఇవాళ(శనివారం) జరిగిన మల్లన్న జాతరలో (Nagarkurnool Mallanna Jathara) తీవ్ర విషాదకర ఘటన జరిగింది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి నిర్వాహకులు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బుల విషయంపై తలెత్తిన వివాదం చివరకు హింసకు దారి తీసింది. ఈ క్రమంలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది.


దర్శనం కోసం డబ్బులు డిమాండ్..

భక్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఏడాదీ జరిగే మల్లన్న జాతరకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే దర్శనం కోసం క్యూలో నిల్చున్న భక్తుల వద్ద.. నిర్వాహకులు దర్శనం పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది భక్తులు ఇది సంప్రదాయంలో లేదని, అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


భక్తులపై దాడి..

ఆలయ నిర్వాహకులు కొంతమంది భక్తులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తల్లిదండ్రుల ఒడిలో ఉన్న మూడు నెలల పాపకు తీవ్ర గాయాలయ్యాయి. తోపులాటలో చిన్నారి నేలపై పడిపోయిందా, లేక నిర్వాహకులు తోసివేయడంతో ప్రమాదం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే తల్లిదండ్రులు మాత్రం నిర్వాహకుల దాడి కారణంగానే తమ బిడ్డకు గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాప మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జాతర నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


పోలీసుల దర్యాప్తు..

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. అలాగే జాతర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు కారణాలు వెలుగులోకి రానున్నాయి. చిన్నారి మృతితో కుమ్మెర గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


బాధిత కుటుంబానికి పరామర్శ..

గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు.. ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 02:54 PM