ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:39 PM
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై(Shabbir Ali) కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి(Venkatramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డి వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో షబ్బీర్ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్, జడ్పీటీసీ చేశామని అన్నారని.. ఆయన కామారెడ్డికి చేసిందేమీ లేదని విమర్శించారు.
వైఎస్ నా రాజకీయ గురువు..
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన అవకాశంతో తాను కాంగ్రెస్ నుంచి గతంలో గెలిచానని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ప్రస్తావించారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా రాజకీయ గురువు. నువ్వు మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డావ్. నువ్వు కట్టిన ఐదు అంతస్తుల భవనానికి మున్సిపల్ అనుమతి లేదు. ఈ నియోజకవర్గం నీ సొంతం కాదు. నీవల్లే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాను. అసెంబ్లీలో హుందాగా ఉండాలని మాట్లాడిన నన్ను ఇలా చీప్‌గా మాట్లాడేలా చేశారు. నాపై నిందలేస్తే ఎలా ఉంటుందో ఈ రోజు చూశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. నాపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశా. మా వాళ్లు ఎవరూ రావద్దని నేను చెబితే మీరు వేలాదిగా తరలిరావాలని మెసేజ్‌లు పెట్టారు. రేపటి నుంచి గ్రామాలకు వస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా. బాన్సువాడలో గొడవ జరిగితే మేం మాట్లాడి సద్దుమణిగేలా చేశాం’ అని ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి తెలిపారు.
నాకేం జరిగినా సీఎందే బాధ్యత..
263 ఎకరాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎలాంటి అక్రమాలు లేవు. నేను ఒక్క గజం అమ్మినా నిరూపించాలని వెంకటరమణా రెడ్డి సవాల్ విసిరారు. ‘దొంగలెవరో ప్రజలకు తెలుసు. నాకేం జరిగినా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత. రేపటి నుంచి యుద్ధమే. ఇది సీఎంకు, నాకూ మధ్య యుద్ధం. కలెక్టర్ వద్ద కూర్చుందాం. కాలేజీ కమిటీ పేరిట ఎఫ్‌డీలు ఉన్నాయి. అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన అక్రమాలపై పోరాడాం. తెలంగాణ యూనివర్సిటీని కామారెడ్డిలో పెట్టమని కోరాం. అప్పుడు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ ఏం చేశారు. తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోం. సోమవారం కలెక్టర్ వద్దకు వెళ్దాం. నాపై ఒక్క తప్పు తేలినా కాళ్లు పట్టుకుంటా, పదవి వదులుకుంటా. రమ్మంటే సీఎంఓకు వస్తా’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. అన్వేశ్‌ను ఉపేక్షించం.. కరాటే కల్యాణి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And Telugu News