రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:39 PM
ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) ఏలూరు జిల్లాలోని కలిదిండిలో ’మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు.
ఏలూరు జిల్లా, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) ఏలూరు జిల్లాలోని కలిదిండిలో ’మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజల ఉత్సాహం చూస్తూంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్టీఏదే విజయమనిపిస్తోందని తెలిపారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్రం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు.
పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎవరి ఫొటో వేసుకోడానికి వీల్లేదు...
అప్పటి సమస్యలు ఇప్పుడు పరిష్కారించామని సీఎం వెల్లడించారు. ఇంతకన్నా రాజకీయ జీవితంలో కావాల్సినదేముందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎవరి ఫొటో వేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వారు భూములు అడిగితే, ప్రజలు ఇవ్వకపోతే, ఆ భూములను 22ఏ లో పెట్టి ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ఆయా సమస్యలు పరిష్కరిస్తే, ప్రజలు జేజేలు కొడతారని పేర్కొన్నారు.
151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారు..
ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే 151 సీట్ల పార్టీ ఏమైందో ప్రజలు చూశారని సీఎం చంద్రబాబు అన్నారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, పరదాల చాటున రావచ్చని, విమానంలో తిరిగి వెళ్లిపోవచ్చని కానీ జగన్ లాగా తాను చేయనని తెలిపారు. ఇలా చేస్తే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7700 గ్రామాల్లో 32 లక్షల 32 వేల పాస్ పుస్తకాలు ఇచ్చామని ప్రస్తావించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు చేయించామని తెలిపారు. దానిలోని వివరాలు ఎవరు మార్చలేరని అన్నారు. 9365 గ్రామాల్లో 68 లక్షల 64వేల పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలిపారు. రాబోయే ఏడు నెలల్లో వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ గౌరవప్రదమైన కార్యక్రమం..
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ గౌరవప్రదమైన కార్యక్రమమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవానికి సంబంధించిన కార్యక్రమమని చెప్పారు. కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు అవినీతి జరుగుతుందని.. అది జరగకుండా ఉండాలనే గ్రామసభల్లో ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలు కూడా కుటుంబ వివాదాలు తగ్గించుకుని, లిటిగేషన్లు లేకుండా చూడాలని సూచించారు. తాను నాలుగోసారి సీఎంగా చేస్తున్నానని.. సీఎం పదవి తనకు కొత్తమే కాదని చెప్పారు. అప్పటికన్నా స్పీడు పెంచానని తెలిపారు. టెక్నాలజీ కూడా పెంచామని వెల్లడించారు. ఈ జిల్లాలో ఎక్కడ చూసినా చేపల చెరువులు ఉంటాయని ప్రస్తావించారు.. తాగునీరు మాత్రం ఉండదని చెప్పారు. కైకలూరులో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.36 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. సూపర్ సిక్స్ అమలు చేశామని స్పష్టం చేశారు. గుంతలు లేని రోడ్లపై సజావుగా ప్రయాణం చేసేలా చేస్తామని వెల్లడించారు.ఇప్పటికే గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ, ముందుకు పోతున్నామని చెప్పారు.
ఆహారపు అలవాట్లు మారుతున్నాయి..
ప్రపంచం అంతా ఆహారపు అలవాట్లు మారుతున్నాయని సీఎం చంద్రబాబు వివరించారు.. భవిష్యత్తు అంతా ఆక్వారంగానిదే అని ఆనాడే చెప్పామని ప్రస్తావించారు. ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి రూపాయిన్నరకే కరెంటు ఇచ్చామని తెలిపారు. వైసీపీ హయాంలో జోన్, నాన్ ఆక్వా జోన్ అని చెప్పి ఆక్వారంగాన్ని ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీలో ఒక దౌర్భాగ్య పార్టీ ఉందని.. అదే గొడ్డలి పార్టీ అని విమర్శించారు. తన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు చూశామని ప్రస్తావించారు. అప్పట్లో నక్సలైట్ల సమస్య ఉండేదని చెప్పారు. తాను వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుంటే, 23 క్లామోర్‌మైన్స్ పెట్టి చంపాలని చూశారని అన్నారు. తాను భయపడలేదని.. తాను ప్రజలకు చేసిన మంచి తనను కాపాడుతుందని భావించానని అన్నారు. రాయలసీమ రాజకీయ ముఠా కక్ష్యలు .. లేకుండా చేయాలని గట్టిగా తాము నిర్ణయించుకున్నామని.. వాటిని లేకుండా చేశామని తెలిపారు.
రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టాం..
హైదరాబాద్‌లో గతంలో మత కక్ష్యలను రెచ్చగొట్టి, ఆరునెలలు కర్ఫ్యూ ఉండే పరిస్థితి ఉండేదని సీఎం చంద్రబాబు చెప్పారు. 2019 నుంచి 2024 వరకు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లు ఉండేవని, రౌడీయిజం చెలాయించేవారని అన్నారు. రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టామని స్పష్టం చేశారు. కొంతమంది పొగాకు రైతులు మంచి రేటు వస్తుందని ఎక్కువగా పంట వేశారని తెలిపారు. దానివల్ల రేటు తగ్గిందని.. తాము కేంద్రప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. దేవరపల్లిలో రైతులను పరామర్శించడానికి జగన్ వచ్చారని.. రైతుల పంటను తొక్కేశారని ఆగ్రహించారు. చొక్కాలు విప్పి విన్యాసాలు చేశారని.. బైకులతో జనాలను ఢీకొట్టారని మండిపడ్డారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వకుండా 356 పిటిషన్లు వేశారని దుయ్యబట్టారు. కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తే.. సంవత్సరం తర్వాత వైసీపీ వారు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీకి వ్యతిరేకంగా కర్నూలులో ఆందోళన చేశారని.. అయినా వారికి సిగ్గుండాలని విమర్శించారు. ఈ రోజు మళ్లీ ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి..
భోగాపురం విమానాశ్రయాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేస్తే.. తామే చేశామని వైసీపీ నేతలు ఇప్పుడు చెప్పడం విడ్డూరంగా ఉందని సీఎం ఎద్దేవా చేశారు. పోలవరం, అమరావతి పూర్తి అయితే అది తామే చేశామంటారని విమర్శించారు. తమ ప్రభుత్వం పనులు పూర్తి చేసి ఆనందం పడుతుంటే.. గొడ్ఢలి పార్టీ ఏం చేస్తుందో చూస్తున్నామని అన్నారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని చంపి, ఆ నేరం తనపై నెట్టి నారాసుర రక్త చరిత్ర అని పేపర్‌లో వేశారని ఆగ్రహించారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈ రోజు సోలార్ పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చామని తెలిపారు. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే క్రమంలో అడ్డు వచ్చేవారికి సహాయ నిరాకరణ చేయాలని అన్నారు. ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఆ రోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి ఒక సంకల్పం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొల్లేరు విషయంలో అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు
అరాచకాలు, అక్రమాలు చేసే వైసీపీ కనుమరుగైపోయింది: మంత్రి డీబీవీ స్వామి
శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత
Read Latest AP News And Telangana News And National News
And Telugu News