Share News

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:06 PM

విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు.

ఏపీ విద్యా వ్యవస్థపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు
Union Minister Dharmendra Pradhan

విజయనగరం జిల్లా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ (Dharmendra Pradhan), ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఈరోజు (మంగళవారం) సందర్శించారు. అనంతరం వారు భోగాపురం నుంచి విశాఖపట్నానికి బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖలో అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి నారా లోకేశ్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను లోకేశ్ వివరించారు.


పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వారి ప్రతిభను అభినందించారు. విద్యాశాఖ మంత్రులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలపై కూడా ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.


అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. పాఠశాలల్లో వంటగదుల నిర్వహణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన ప్రమాణాలను రూపొందించి అమలు చేస్తామని చెప్పారు. విద్యా రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 03:05 PM