Share News

ప్రధాని భోగాపురం పర్యటనకు భారీ బందోబస్తు

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:53 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రధాని భోగాపురం పర్యటనకు భారీ బందోబస్తు

విజయనగరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఇక్కడకు రానున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.


భద్రతా ఏర్పాట్లు ఇలా..

ప్రఽధాని మోదీ పర్యటన దృష్ట్యా భద్రతను 4 సెక్టార్లుగా విభజించారు. సుమారు 60ఎకరాల సభా వేదికతోపాటు విమానాశ్రయం నుంచి వేదిక వరకు ఉన్న మార్గాన్ని ప్రధాని భద్రతా సిబ్బంది బుధవారం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, సెక్యూరిటీ అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

సెక్టార్‌-1(జిల్లా, రాష్ట్ర పోలీసులు):

ఎస్పీ దామోదర్‌ సారథ్యంలో విజయనగరం జిల్లా పోలీసు బలగాలతోపాటు ఐదు జిల్లాల నుంచి వచ్చిన 7వేల మంది పోలీసులను విమానాశ్రయం మొత్తం మోహరించారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా నేతృత్వంలో పెద్దసంఖ్యలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. సెక్టార్‌-2 (ప్రత్యేక భద్రతా దళాలు): స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) ప్రధాని ప్రత్యక్ష భద్రతకు బాధ్యత వహిస్తుంది. రాష్ట్రానికి చెందిన ఆక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ కమెండో దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. బీసీఏఎస్‌ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.


సెక్టార్‌-3(ఇంటెలిజెన్స్‌. ఇతర ఏజెన్సీలు):

వేదిక చుట్టుపక్కల, హోటళ్లు, లాడ్జీల్లో నిఘా పెట్టేందుకు ఐబీ, స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని వినియోగిస్తున్నారు. వేదిక, పార్కింగ్‌ ప్రాంతాలు, ఇతర ప్రత్యేక మార్గాలను డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ పరిశీలిస్తాయి. కంట్రోల్‌ రూం నుంచి సీసీ టీవీల ద్వారా నిర్విరామంగా నిఘా ఉంచుతారు.

సెక్టార్‌-4(సహాయక విభాగాలు):

సుమారు 10వేల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యంతోపాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక మార్గంలోకి మళ్లిస్తారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్‌ సిబ్బంది వాహనాలను సిద్ధం చేశారు. అంబులెన్స్‌లు, డాక్టర్లతో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. అనుకోని ఆకస్మిక ఘటనలు ఎదురైతే తక్షణమే సేవలు అందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉంటాయి.


జానపద ప్రదర్శనలతో మోదీకి స్వాగతం

ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే డీజీసీఏ, ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌, కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ అనుమతులు వచ్చాయి. ప్రధాని సభకు వచ్చేవారికి క్యూలైన్లు, చెకింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విమానాశ్రయం పరిసరాల్లో 130 మెడికల్‌ క్యాంపులు

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి తరలివస్తున్న లక్షలాది మంది ప్రజలు, అభిమానుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా విమానాశ్రయం పరిసరాల్లో 130 మెడికల్‌ క్యాంపులు నిర్వహించనుంది. వాటిలో థింసా నృత్యం ప్రదర్శించే 13వేల మంది విద్యార్థినుల కోసం 29 మెడికల్‌ క్యాంపులు, పార్కింగ్‌ వద్ద 104 వాహనాలు 10, 108 వాహనాలు 22, ఐసీయూ తరహా డబుల్‌ బెడ్‌ సేఫ్‌హౌస్‌, టెర్మినల్‌ సమీపంలో 10 బెడ్లతో తాత్కాలిక ఆస్పత్రులు 10 సిద్ధం చేశారు. వేదిక సమీపంలో 5 బెడ్లతో కూడిన సేఫ్‌హౌస్‌ ఏర్పాటు చేశారు. అడ్వాన్స్‌ లైఫ్‌ సఫోర్ట్‌ వాహనాలు 22 ఉంటాయి. వైద్యసేవల కోసం 700 మందిని నియమించామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి జీవ నరాణి చెప్పారు.


వార్తలు కూడా చదవండి...

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్

ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 07:12 AM