తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:18 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్‌నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్‌నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లాభాల కోసమే ఇదంతా చేశారని ధ్వజమెత్తారు. ఏడుకొండల స్వామి లడ్డూని కల్తీ చేసిన దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
వైసీపీ నేతలు నానా యాగి చేస్తున్నారు..
ఆదివారం విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కెమికల్స్ వాడారని ఆరోపించారు. ఇప్పుడేమో లడ్డూలో కొవ్వు కలవలేదంటూ వైసీపీ నేతలు నానా యాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు.. అసలు పాలతో వచ్చిన నెయ్యి కాదని.. పామ్ ఆయిల్ కెమికల్ కలిపి లడ్డూని తయారు చేశారని స్పష్టంగా సిట్ అధికారులు ఇచ్చిన రిపోర్టులు చెబుతున్నాయని ప్రస్తావించారు.
వేంకటేశ్వర స్వామి జోలికెళ్లి ఇబ్బందులు పడొద్దు..
ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి తయారు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహించారు. వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి జోలికెళ్లి ఇబ్బందులు పడొద్దని హితవు పలికారు. ప్రజలకు తెలియాలని వాస్తవాలు చెబుతున్నామని అన్నారు. టీటీడీ లడ్డూలో పామ్ ఆయిల్, కెమికల్ కలిపింది వాస్తవమని చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీలో ఈ విషయంపై చర్చిస్తామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు..
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Read Latest Telangana News And AP News And Telugu News