Share News

Union Minister Ram Mohan Naidu: వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..

ABN , Publish Date - Jan 03 , 2026 | 06:09 PM

శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.

Union Minister Ram Mohan Naidu: వైసీపీ హయాంలో డ్రగ్స్‌కి.. ఏపీ క్యాపిటల్‌గా ఉండేది..
Union Minister Ram Mohan Naidu

శ్రీకాకుళం, జనవరి3 (ఆంధ్రజ్యోతి):వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Ram Mohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏపీ డ్రగ్స్‌కి క్యాపిటల్‌గా ఉండేదని ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో గిరిజనులను బలిపశువులను చేశారని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉండేవని విమర్శలు చేశారు. ఆ పరిస్థితి మారాలని ఈ మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) శ్రీకాకుళం ఇచ్ఛాపురంలో అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభకు హోంమంత్రి అనిత, రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు రామ్మోహన్ నాయుడు.


ఏపీని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంచడానికి చంద్రబాబు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ కృషిలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల పని తీరు వర్ణించలేనిదని కొనియాడారు. గతంలో పోలీసులను రాజకీయ వేధింపులకు వాడుకునే వారని విమర్శించారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో పోలీసులకు శిక్షించడం మాత్రమే కాదని.. శిక్షణ ఇవ్వడం కూడా తెలుసు అనేలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఒకప్పుడు పంజాబ్ వ్యవసాయానికి ప్రసిద్ధిగా ఉండేదని ప్రస్తావించారు. ఇప్పుడు పంజాబ్‌లో అడుగడుగునా డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని విమర్శించారు. పంజాబ్ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌లా ఏపీ మారకూడదనే తాము కంకణం కట్టుకున్నామని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.


గతంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మన తల్లుల ఆవేదన చూశామని అన్నారు. తమకేం వద్దని.. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తే చాలని మన తల్లులు లోకేశ్‌ని కోరారని తెలిపారు. ప్రతీ ఇంట్లో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మన ఇంట్లోనే కాదని.. పక్క ఇంట్లో కూడా ఎవరైనా డ్రగ్స్ వాడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పిల్లలు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారని అన్నారు. డ్రగ్స్ వాడకం కూడా అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. సిగరెట్, డ్రగ్స్ వాడకం స్టైల్ కాదని.. నిజాయితీగా ఉండటం మాత్రమే అసలు సిసలైన్ స్టైల్ అని పేర్కొన్నారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనేది పిల్లల నినాదం కావాలని సూచించారు. శ్రీకాకుళం అంటే లేబర్ ప్రాంతం కాకూడదని తెలిపారు రామ్మోహన్ నాయుడు.


శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు. డ్రగ్స్‌కి బదులు ఇప్పుడు మంచి పంటలు పండిస్తున్నామని వివరించారు. ఇచ్చాపురంలో చాలా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇప్పుడు అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు యాత్ర నిర్వహించామని.. ఈ ముగింపు యాత్రను పోలీసులు చాలా గొప్పగా ఏర్పాటు చేశారని రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అదనంగా ప్రోత్సహకాలు ఇవ్వాలి: మాధవ్

చంద్రబాబు దార్శనికత, లోకేశ్ నిబద్ధతతో పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 07:12 PM