జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:54 PM
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు.
మార్కాపురం జిల్లా, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. పనులు పూర్తికాకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారని సెటైర్లు గుప్పించారు. ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు ఉన్నాయని వివరించారు. ఇవాళ(బుధవారం) మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టుతో ఏపీకి పూర్వ వైభవం..
మార్కాపురం జిల్లా ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీకి పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్యానించారు. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పానని.. మాట నిలబెట్టుకున్నానని, అలాగే మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని కోరారు. ఏపీకి మేలు చేసేందుకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను కలిశామని ప్రస్తావించారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమిదే హవానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాలో నూరుశాతం స్ట్రైక్‌రేట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. మదనపల్లెకు కూడా న్యాయం చేస్తానని చెప్పా.. చేశానని ప్రస్తావించారు. మూడు వరాలు ఇచ్చేందుకు మార్కాపురం వచ్చానని తెలిపారు. 1995లో మార్కాపురం ప్రజల కష్టాలు తాను చూశానని గుర్తుచేశారు.
వెలిగొండతో రైతుల జీవితాలు బాగుపడతాయి..
వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య వెలిగొండ పనులను పరుగులు పెట్టించామని చెప్పారు. మార్కాపురం వెనుకబడిన ప్రాంతమని.. 1996 మార్చి 5వ తేదీన ఈ ప్రాంతానికి వచ్చానని.. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ నీళ్లు కనిపించేవని గుర్తుచేశారు. తమకు శ్రీశైలం నీళ్లు కావాలని ఆనాడు ప్రజలు అడిగారన్నారు. కృష్ణా జలాలు తీసుకొస్తానని ఆరోజు మాట ఇచ్చానని.. వెలిగొండకు ఫౌండేషన్ తానే వేశానని.. పూర్తిచేసే అవకాశం తనకే వచ్చిందని పేర్కొన్నారు. ఒట్టి మాటలు చెప్పి మోసం చేయడం తనకు రాదని చెప్పుకొచ్చారు. 2014 వరకు వెలిగొండ పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. 2014 నుంచి 2019 మధ్య పనులు పరుగులు పెట్టించానని తెలిపారు. వెలిగొండతో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్
వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..
Read Latest Telangana News And AP News And Telugu News