Share News

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం

ABN , Publish Date - May 31 , 2026 | 08:13 PM

నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి ఆనం
AP Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈరోజు (ఆదివారం) పొగాకు రైతు ప్రతినిధులతో.. మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యలపై మంత్రి ఆనం చర్చించారు.


పోగాకు ధరలు గణనీయంగా పడిపోయాయి..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొగాకు రైతు ప్రతినిధులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఆనం వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో సుమారు 45 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నారని తెలిపారు. దాదాపు 4 వేల రైతు కుటుంబాలు ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పుకొచ్చారు. జిల్లాలో 3,600 పొగాకు బ్యారెన్లు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది పొగాకు ధర కిలోకు రూ.280 నుంచి రూ.360 వరకు పలికిందని, ప్రస్తుతం డీసీపల్లి, కలిగిరి కొనుగోలు కేంద్రాల్లో కిలోకు కేవలం రూ.190 మాత్రమే వస్తోందని పేర్కొన్నారు. ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.


పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం..

ఈ సమస్యను ఇప్పటికే మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బాలవీరాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి ఆనం తెలిపారు. అంతేకాకుండా కేంద్ర వాణిజ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రులతో కూడా సీఎం చర్చించారని అన్నారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూ, మార్కెట్ పరిస్థితులను సమీక్షించి తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 08:17 PM