శ్రీశైలం ఆలయంలో నిధుల దుర్వినియోగం.. విజిలెన్స్ అధికారుల చర్యలు
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:41 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
నంద్యాల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానంలో (Srisailam Temple) చేపట్టిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపట్టిన కొన్ని ఇంజినీరింగ్ పనుల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శ్రీశైలం ఆలయంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పలు పనుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ (Ramachandra Mohan) స్పందించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన ఇంజినీరింగ్ పనులకు సంబంధించి బాధ్యులైన ఇంజినీర్లు, అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ అధికారులు నిర్వహించిన పరిశీలనలో పనుల అమలు, అంచనాలు, చెల్లింపుల ప్రక్రియల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై పూర్తి నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు.
అదేవిధంగా, పనుల అమల్లో చోటుచేసుకున్న లోపాల కారణంగా సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి రూ.8.5 లక్షలు వసూలు చేయాలని కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో బాధ్యతారాహిత్యం, నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించబోమని కమిషనర్ రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు
జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News