బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
ABN , Publish Date - May 14 , 2026 | 06:51 PM
వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
కర్నూలు, మే 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై (Byreddy Siddharth Reddy) ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ (AP Minister TG Bharat) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (గురువారం) కర్నూలు వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూల్‌లో తమ పోలింగ్ బూత్ ఇన్‌చార్జి సునీల్‌పై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులు బాలు అనే వైసీపీ వ్యక్తిని విచారించారని అన్నారు. దీంతో ఈ అంశాన్ని డ్రామా రూపంలో బైరెడ్డి తెరపైకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఆయనకు మైండ్ లేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒక జోకర్ అని జగన్‌కు కూడా తెలుసునని ఎద్దేవా చేశారు. తనపై లేని పోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇంతవరకూ తమపై బైరెడ్డిలాగా ఆరోపణలు చేసిన వారు ఎవరు లేరని అన్నారు. ఈ విషయంలో తాను బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ పరువు నష్టం దావా కేసును ఆయన ఎలా ఫేస్ చేస్తారో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు.
పరిశ్రమల కోసం కష్టపడుతున్నాం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిశ్రమలు, కంపెనీల రాకకోసం తాము ఎంతగా కష్టపడుతున్నామో ప్రజలందరికీ తెలుసునని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఏపీకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, తాను ఎంతో కష్టపడుతున్నామని వ్యాఖ్యానించారు. సీబీఎన్ బ్రాండ్ మూలంగానే తాము వీటిని సాధించగలుగుతున్నామని ఉద్ఘాటించారు. తమ మైండ్‌ను డైవర్ట్ చేయడానికి కర్నూలుకు బైరెడ్డి అనే ఓ జోకర్ వచ్చారని ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడకు వచ్చి పిట్టకథలు చెబుతున్నారని సెటైర్లు గుప్పించారు. బైరెడ్డి కర్నూలుకు వచ్చి తనపై లేని పోని ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ఆయన చేసిన ఆరోపణలపై తాను పశ్చాత్తాపం చెందాల్సి వస్తోందని పేర్కొన్నారు.
జోకర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.. మంత్రి ఎద్దేవా..
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి చేతనైతే కర్నూలు నుంచి 2029 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకోవాలని మంత్రి టీజీ భరత్ సవాల్ విసిరారు. ప్రజలు అప్పుడు ఆయనను గెలిపిస్తారో లేదో చూద్దామని అన్నారు. బైరెడ్డి చిన్నవయసులోనే జైలుకెళ్లారని.. హత్యకేసులో కూడా ఉన్నారని ఆరోపించారు. ఓర్వకల్లులో పరిశ్రమల కోసం తాము ఎంతో కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఆయన వీటి గురించి తెలియకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో వైరల్ అయితే.. తాను చాలా గొప్పవాడినని బైరెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు. అందుకనే ఆయనకు జోకర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని పేరు పెడుతున్నానని ఎద్దేవా చేశారు. తాను సీరియస్‌గా రాజకీయాలు చేస్తే తట్టుకోగలవా అని ప్రశ్నించారు. ఆయనకు నోటికి వచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కర్నూలు వచ్చి స్టాండప్ కామెడీ షోలా.. బైరెడ్డి షో చేసి వెళ్లిపోయారని మంత్రి టీజీ భరత్ సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
Read Latest AP News And Telangana News And International News And Telugu News