జగన్ హయాంలో ఎన్నికల్లో అరాచకాలు, గొడవలు సృష్టించారు: మంత్రి ఫరూక్
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:22 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి NMD ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆయా ఎన్నికల్లో అరాచకాలు, గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు.
కర్నూలు జిల్లా, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి NMD ఫరూక్ (AP Minister NMD Farooq) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఆయా ఎన్నికల్లో అరాచకాలు, గొడవలు సృష్టించారని ధ్వజమెత్తారు. తమను బెదిరించి, అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తాము స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ పథకాలను, తాము చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఎన్టీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఈరోజు (ఆదివారం) కర్నూలు జిల్లాలో మంత్రి ఫరూక్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మంత్రి ఫరూక్ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు హయాంలో ముస్లింల కోసం కమ్యూనిటీ హాళ్లు, షాదీఖానాలను కట్టించారని పేర్కొన్నారు. నంద్యాలలో ఎన్టీఆర్ పేరుతో షాదీఖానాను అప్పట్లో ప్రారంభించామని ప్రస్తావించారు. 1986లో కర్నూలులో ఏపీలోనే మొదటిసారిగా షాదీఖానా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు షాదీఖానాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.60 కోట్ల దాకా నిధులు మంజూరు చేశామని చెప్పారు.
జగన్ అధికారంలోకి వచ్చాక అన్నింటిని రద్దు చేశారని మంత్రి ఫరూక్ ఆగ్రహించారు. పిల్లలందరికీ తమ ప్రభుత్వం తల్లికి వందనం అందిస్తోందని తెలిపారు. ప్రజలు ఆహారం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. హార్టికల్చర్ హబ్‌ను రాయలసీమ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్ సాగుపై రైతన్నలు దృష్టి సారించాలని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు
బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News