స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:15 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నంద్యాల జిల్లా , నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేక కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టించడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని మంత్రి హితవు పలికారు. వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం..
పంచాయతీ ఎన్నికలపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఈరోజు (ఆదివారం) నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మండల ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులతో పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేడర్‌కు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల కార్యాచరణపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం..
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయాన్ని పంచాయతీ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సర్పంచ్ పదవులకు బహిరంగ వేలాలు, ఏకగ్రీవాల కోసం బెదిరింపులు అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్
గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News