బెంగళూరు ప్యాలెస్ నుంచి ఏపీపై జగన్ కక్ష సాధిస్తున్నారు.. ఎంపీ కలిశెట్టి ధ్వజం
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:30 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీ మూకలను ప్రోత్సహించి, అల్లర్లు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయాలని జగన్ రెడ్డి కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetti Appala Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీ మూకలను ప్రోత్సహించి, అల్లర్లు సృష్టించి ఎన్నికలను వాయిదా వేయాలని జగన్ రెడ్డి కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) అమరావతి వేదికగా మీడియాతో ఎంపీ కలిశెట్టి మాట్లాడారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయని, ఇప్పుడు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. బెంగళూరు ప్యాలెస్‌లో జగన్ కూర్చొని ఏపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.
ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు..
తాడేపల్లి ప్యాలెస్‌కు చుట్టపు చూపుగా వచ్చి ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రజలను జగన్ రెడ్డి గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ కలిశెట్టి దుయ్యబట్టారు. వైసీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని.. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ఓటుతో జగన్ అండ్ కోకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ (CII) సదస్సు సూపర్ హిట్ అయిందని తెలిపారు. 31వ సీఐఐ సదస్సు ద్వారా ఏపీకి రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి లోకేశ్ కార్యాచరణపై నమ్మకంతోనే ఏపీకి దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు తరలివచ్చారని ప్రస్తావించారు.
పేదల అభ్యున్నతికి కృషి..
పీ4 (P4) కార్యక్రమం ద్వారా పేదల అభ్యున్నతికి తాము కృషి చేస్తున్నామని ఎంపీ కలిశెట్టి తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో పేద కుటుంబాలను ఆదుకునేలా కార్పొరేట్ సంస్థలు ముందడుగు వేస్తున్నాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖపట్నం సదస్సులే గేట్‌వేనని చెప్పారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు నేడు పూర్వ వైభవం తీసుకువచ్చామని వ్యాఖ్యానించారు.
వైసీపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు..
రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రుల చుట్టూ అవిశ్రాంతంగా తిరుగుతున్నారని ఎంపీ కలిశెట్టి అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందు అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులకు కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి ఉండేదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆంధ్రప్రదేశ్‌ను కార్పొరేట్ హోంగా మార్చుకోండి: మంత్రి లోకేశ్
పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని సీఎం చంద్రబాబు మార్చారు: పీయూష్ గోయల్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం: మంత్రి దుర్గేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News