పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని సీఎం చంద్రబాబు మార్చారు: పీయూష్ గోయల్
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:52 PM
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం సంతోషదాయకమని పేర్కొన్నారు.
విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం సీఐఐ భాగస్వామ్య సదస్సుకు శాశ్వత వేదికగా మారుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal) వ్యాఖ్యానించారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పెట్టుబడుల సదస్సు నిర్వహించటం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుందని.. పెట్టుబడుల సదస్సు కూడా దేశ వాణిజ్యాన్ని వృద్ధి చేస్తోందని ఉద్ఘాటించారు. ఈరోజు (గురువారం) విశాఖపట్నంలో అట్టహాసంగా 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 ప్రారంభమైంది. 'నేవిగేటింగ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్' థీమ్‌తో మొదటి రోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఇటీవలే రెండు తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకాయని.. పలు జిల్లాల్లో విధ్వంసం సృష్టించాయని తెలిపారు.
వ్యవస్థలను చంద్రబాబు చక్కదిద్దుతున్నారు..
తుఫాన్ల ద్వారా నష్టం జరిగినా వెంటనే కోలుకుని విశాఖ నగరం పెట్టుబడుల సదస్సుకు వేదికగా మారిందని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలను, ఆయా దేశాల రాయబారులను, ప్రతినిధులను ఆహ్వానించారని పేర్కొన్నారు. కాలం కంటే ముందు ఆలోచన చేసి ఏఐ, క్వాంటం లాంటి టెక్నాలజీల గురించి సీఎం చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. అంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే ఆయన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచేలా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించేందుకు ఎస్క్రోఖాతాను ఏపీ ప్రారంభించిందని తెలిపారు. 2024లో సీఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రానికి పెద్దఎత్తున అప్పులు, విధ్వంసమైన వ్యవస్థలు ఆయన చేతికి వచ్చాయని పేర్కొన్నారు. అయినా ఏపీని వేగంగా పునరుద్ధరించి వ్యవస్థలను చక్కదిద్దుతూ పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీని మార్చారని ఉద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో మాదిరిగా సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నీరు, నిప్పులా అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం, సవాళ్లు, పోటీ నెలకొన్నాయని వెల్లడించారు.
పెట్టుబడిదారులకు భారత్ భరోసా..
ఇలాంటి విపత్కర సమయంలోనే పెట్టుబడిదారులకు భారత్ భరోసాగా నిలుస్తోందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆంధ్ర ప్రాంత పాలకుడైన కాకతీయ రాజు గణపతి దేవుడు అప్పట్లోనే విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా కొన్ని శాసనాలను రూపొందించారని ప్రస్తావించారు. అప్పుడూ, ఇప్పుడూ భారత్ విదేశీ పెట్టుబడిదారులకు విశ్వసనీయమైన భాగస్వామిగా ఉందని తెలిపారు. భారత జీడీపీ పెరుగుదలలో విదేశీ పెట్టుబడులకు నైపుణ్యం ఉన్న యువత కూడా అంతేస్థాయిలో సహకారం అందిస్తున్నాయని వివరించారు. భారతీయ యువత ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. విశాఖ నగరం స్టీల్ నుంచి సిలికాన్ సిటీగా ఎదుగుతోందని చెప్పుకొచ్చారు. ఓర్వకల్లు, పూడిమడక లాంటి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ కేంద్రాలుగా మారుతున్నాయని వివరించారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ను భారత్ పూర్తిగా గౌరవిస్తోందని.. సహకారం అందిస్తోందని అన్నారు. భారత్ ఎప్పుడూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి కోరదని, అలాగే వారి మేధోసంపత్తిని చౌర్యం చేయదని స్పష్టం చేశారు. నాణ్యమైన ఉత్పత్తులను అత్యంత చౌకగా, వేగంగా ఉత్పత్తి చేసేలా పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. భారత్, ఏపీలో పెట్టుబడులను పెట్టండి, తయారీ రంగంలో, పర్యాటక రంగంలో వేర్వేరు రంగాల్లో అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దేశభాషలందు తెలుగు భాష తీయనైనదని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో చెప్పారని.. అలాంటి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని తాము కోరుతున్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఐఐ సదస్సుతో ఏపీ అభివృద్ధికి కొత్త అవకాశాలు: సీఎం చంద్రబాబు
తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి
పీఆర్పీ.. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News