తుఫాన్ ద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:24 PM
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మురసు తుఫాన్ ప్రభావంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశంనిర్వహించారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో.. మురసుతో జరిగిన నష్టం, అనంతర పరిణామాలపై చర్చించారు.
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మురసు తుఫాన్ ప్రభావంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravikumar) ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఆర్ అండ్ బీ అధికారులతో.. మురసు తుఫాన్ ద్వారా జరిగిన నష్టం, అనంతర పరిణామాలపై చర్చించారు. తుఫాన్‌తో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల పురోగతిపై ఆరా తీశారు. గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ దాదాపు పూర్తి అయిందని మంత్రికి అధికారులు తెలిపారు. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి..
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరా లేక, సాగునీరు అందక ఏ ఒక్క రైతు పంట కూడా దెబ్బతినకుండా చూడాలని అధికారులకు సూచించారు. పంటల వారీగా నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నష్టం జరిగిన వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటల విస్తీర్ణంతో పాటు నష్టపోయిన రైతులందరి వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించి అంచనాలను సిద్ధం చేయాలని ఆజ్ఞాపించారు.
ఉద్యాన పంటల నష్టంపై ప్రత్యేక దృష్టి..
అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి గొట్టిపాటి మార్గనిర్దేశం చేశారు. పంటల నష్టం అంచనాలను.. రైతుల ఫిర్యాదులను పరిశీలించి పారదర్శకంగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తుపాన్‌తో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్ల మరమత్తులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి..
పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ తదితర ప్రయోజనాలను త్వరితగతిన రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. మురసు తుఫాన్‌తో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితిపై ఆరా తీశారు. రహదారులు, అంతర్గత రోడ్ల మరమత్తులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు ఆటంకాలు లేకుండా, ప్రజలు ఇబ్బందులు పడకుండా రహదారుల పనులు పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ
జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News