Share News

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ

ABN , Publish Date - Nov 10 , 2026 | 09:42 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఉదయం 10:30లకు క్యాబినెట్ భేటీ జరగనుంది. 30కు పైగా అజెండా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ
AP Cabinet Meeting

అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు (మంగళవారం) ఉదయం 10:30లకు క్యాబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగనుంది. 30కు పైగా అజెండా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానిమేషన్, వీఎఫ్ఎక్స్ 2026-31 పాలసీ, రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీల ముసాయిదాలకు ఇవాళ మంత్రిమండలిలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ (4.0) పాలసీ ముసాయిదాకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.


అదానీ గ్రూప్ క్లౌడ్ హబ్ ప్రతిపాదనలపై చర్చ..

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్ల పెట్టుబడితో ఇప్యాక్ డేటా సెంటర్‌కు 2,565 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అదానీ గ్రూప్ క్లౌడ్ హబ్ ప్రతిపాదనలపై చర్చించనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.4,000 కోట్లతో కార్బన్ కాస్మో అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ ప్లాంట్.. 700 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఓకే చెప్పనుంది. తిరుపతిలో రూ.700 కోట్ల పెట్టుబడితో డిక్సన్ టెక్నాలజీస్ ప్లాంట్... 2,300 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఏఎం ఇంటెలిజెన్స్ సంస్థ ఆధ్వర్యంలో రూ.31,387 కోట్లతో గ్రీన్ ఏఐ డేటాసెంటర్... వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.


ఇండస్ట్రీయల్ పార్క్‌ గురించి..

పశ్చిమ గోదావరిలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ యూనిట్ విస్తరణ... 1,569 మందికి ఉపాధి అవకాశాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో హెటిరో గ్రూపునకు 173.82 ఎకరాల భూకేటాయింపునకు మంత్రిమండలి ఆమోదించనుంది. అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో స్కికార్ప్ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్క్ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం 30 ఎకరాల్లో 'ఫ్లో (FLO)' ఇండస్ట్రీయల్ పార్క్‌కు క్యాబినెట్‌లో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. నాయుడుపేట సెజ్‌లో వెబ్‌సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు భూకేటాయింపులను రద్దు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విజయవాడలో రోజుకు 1023 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసేలా 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఓకే చెప్పనుంది.


వక్ఫ్‌భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై..

అనంతపురం జిల్లా వజ్రకరూరులో 192.68 ఎకరాల వక్ఫ్ భూముల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతి ఇవ్వనుంది. ఏపీ పోలీసు శాఖలో కొత్తగా ఐజీ స్థాయి అధికారితో 'డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ' ఏర్పాటు చేసే అంశంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. తిరుమలలో కొత్తగా ప్రధాన సన్నిధి యాదవ, సన్నిధి యాదవ పోస్టులపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఏపీలో థర్మల్ ప్లాంట్లకు ప్రత్యామ్నాయంగా SMR టెక్నాలజీతో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై ఏపీ సర్కార్ దృష్టి సారించనుంది.


విశాఖ పార్టనర్‌‌షిప్ సమ్మిట్‌పై చర్చ..

ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ గిగా స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ (AIDC) కోసం 24.9 ఎకరాల కేటాయింపుపై క్యాబినెట్ చర్చించనుంది. పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ కోసం 2 ఎకరాలు, తంబళ్లపల్లెలో ఎంఎస్ఎంఈ (MSME) పార్క్ కోసం సుమారు 21 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. మంత్రిమండలి సమావేశం అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 12, 13వ తేదీన విశాఖపట్నంలో పార్టనర్‌‌షిప్ సమ్మిట్‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు

స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 10:15 AM