Share News

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:03 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.

రైతు భూమిని కాజేస్తారా.. బుగ్గనపై సీఎం చంద్రబాబు ధ్వజం
AP CM Chandra babu Naidu

నంద్యాల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) ఈరోజు (సోమవారం) డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజులో పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారని సీఎం చంద్రబాబుకు ఓ రైతు ఫిర్యాదు చేశారు. విచారించి సమస్య పరిష్కరించాలని ఆర్డీవోను సీఎం ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే ఆక్రమణ దారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఓ రైతు భూమిని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తన అనుచరుల పేరుతో మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఏపీలో మొత్తం 3.40 లక్షల ఎకరాలు ఉందని ప్రస్తావించారు.


ఇష్టారాజ్యంగా భూముల తారుమారు..

అందులో 1.95లక్షల ఎకరాలు 22A కింద పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. జగన్ హయాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద లక్షల ఎకరాల భూములను అధికారుల ప్రమేయం లేకుండానే ఇష్టారాజ్యంగా తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు పాన్యంలో పాస్ బుక్‌ను చించేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేస్తానని తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశానని తెలిపారు. గతంలో తాను రెవెన్యూ మంత్రిగా పని చేశానని.. రెవెన్యూ సమస్యలు, చట్టాలపై పూర్తిగా అవగాహన ఉందని స్పష్టం చేశారు. భూములు ట్యాంపరింగ్ జరగకుండా డిజిటల్ పాస్ బుక్‌లు ఇస్తున్నామని వెల్లడించారు. పట్టాదారు పాస్ పుస్తకాల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం డిసెంబర్ నాటికి భూ సమస్యలు పరిష్కారిస్తామని మాటిచ్చారు. అనుభవంలో ఉన్న రైతులకు నెలలోపు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇస్తామని చెప్పుకొచ్చారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకుండా అరగంటలో రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి..

రేషన్ పింఛన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది ఉన్న కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తాము ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. పిల్లల బాధ్యత భార్య, భర్తలదేనని చెప్పుకొచ్చారు. ఆడవారితో పాటు మగవారికి కూడా రెండు నెలలు సెలవులు ఇస్తానని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 50 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. నంద్యాల జిల్లాలో ఆర్ అండ్ బీ రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశామన్నారు. పంచాయతీ రోడ్లపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించానని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడలో డ్రోన్ సిటీతో పాటు అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.


పరిశ్రమల ద్వారా భారీగా ఉద్యోగాలు..

పరిశ్రమల ద్వారా భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఐదేళ్లు కరెంట్ చార్జీలు పెంచనని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నామని తెలిపారు. చదువు రాని వాళ్ల కోసం రానున్న రోజుల్లో మాట్లాడే మాటలను టెక్స్ట్‌గా కన్వర్ట్ చేసి సొల్యూషన్ చూపిస్తామని చెప్పుకొచ్చారు. గుజరాత్‌లో చాలా ఏళ్ల నుంచి ఒకే ప్రభుత్వం కొనసాగుతోందని.. ఏపీలో కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించారు. కొత్త వ్యక్తుల మాటలు నమ్మితే మళ్లీ మోసపోతారని అన్నారు. నాడు జన్మభూమి తెచ్చానని.. నేడు MBK 1020 తీసుకొచ్చానని తెలిపారు. ధనవంతులు P4 కింద పేదలను దత్తత తీసుకొని ఆర్థికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు.


కొత్త బురుజుకు సీఎం వరాల జల్లు..

కొత్త బురుజు గ్రామానికి సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. జేజేవైఎమ్ కింద కొత్త బురుజు గ్రామంలో ప్రతి ఇంటికి కొల్లాయిల ద్వారా తాగునీరు అందిస్తామని మాటిచ్చారు. కొత్త బురుజులో 50 మందికి ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. డోన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు..

సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 09 , 2026 | 04:17 PM