సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరచకూడదు: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 09:12 AM
మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు.
అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. మహిళల గౌరవం, సాధికారత, సమానత్వం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సృష్టి మీది..
‘అమ్మా! నీవు ఆకాశంలో సగం కాదమ్మా! నింగీ నేలా నీవేనమ్మా! ఈ సృష్టి మీది. మా జన్మ మీది. అమ్మ జన్మనిస్తే.. జీవితాంతమూ అమ్మమ్మ, నాన్నమ్మ, అక్కా, చెల్లి, భార్య, అత్త, పెద్దమ్మ, పిన్ని, వదిన, మరదలి రూపంలో మనల్ని కంటికి రెప్పలా కాచే మాతృమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళల్ని గౌరవించాలనే గొప్ప నైతిక విలువలను నా తల్లి ఉగ్గుపాలతోనే నేర్పింది. నా తాత నందమూరి తారక రామారావు తెలుగింటి ఆడపడుచులకు అన్న అయి ఆస్తిహక్కు ఇచ్చారు. నా తండ్రి మహిళా సాధికారతకు స్వయంశక్తి సంఘాలను ఆరంభించారు. ఇంటికొక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. స్త్రీశక్తి, తల్లికి వందనం పథకాలు మహిళామణులకు మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. మహిళలను గౌరవించేలా పిల్లలు ఎదగాలని నైతిక విలువల సలహాదారులుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమించాం. వారి దిశానిర్దేశంలో నైతిక విలువలు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాం. పాఠ్యపుస్తకాలలో ఎక్కడ స్త్రీ, పురుషుల చిత్రాలున్నా.. వారిద్దరూ సమానంగా ఉన్న ఫొటోలనే వేశాం. ఆడపిల్లలుగా ఏడవొద్దు, గాజులు తొడుక్కోలేదు, చీర - గాజులు పంపిస్తా వంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పు అని చెబుతాను. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరిచే భాష, సన్నివేశాలు ఉండకూడదని పోరాడుతున్నాను. అన్నిరంగాల్లో దూసుకుపోతోన్న మహిళామూర్తుల శక్తికి, సహనానికి, అనురాగానికి శతకోటి వందనాలు’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News