Share News

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:38 AM

విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్
Vijayawada Firing Incident

విజయవాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు (Vijayawada Firing Incident) జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసులు, ఈగల్ అధికారులు బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో కార్డన్ సెర్చ్ (తనిఖీలు) నిర్వహిస్తున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.


త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

ఈ సమయంలో నిందితుడు ట్రిగ్గర్ నొక్కినప్పటికీ, టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ ఛాంబర్‌లోకి రాకపోవడంతో అధికారులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కాల్పులు విఫలం కావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు, ఈగల్ అధికారులు ప్రాణాలకు తెగించి అతడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 9 MM పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


పోలీసుల దర్యాప్తు..

పోలీసులు నిందితుడిని అతి కష్టం మీద అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అసలు ఆ వ్యక్తి విజయవాడకు ఎందుకు వచ్చాడు?, గన్ ఎలా వచ్చింది..?, ఎవరినైనా హతమార్చేందుకు అతడు కుట్ర పన్నాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు

జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 11:14 AM