Share News

మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు.. సీఎం ప్రశంసలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:09 PM

కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు.

మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు.. సీఎం ప్రశంసలు
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కష్టానికి, ప్రేమకు, సహనానికి స్త్రీలు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. స్త్రీలను పూజించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు. స్త్రీలను ఉన్నతస్థాయికి చేర్చేందుకు అన్నిమార్గాలు అన్వేషిస్తున్నామని తెలిపారు. ఏపీలో ముగ్గురు మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాజధాని అమరావతిలో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి కందుల దుర్గేశ్ హాజరయ్యారు. చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై సంతకాలు చేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పనకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన స్వయంబ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


శక్తివంతమైన మహిళలు..

సాధారణ మహిళ శక్తివంతమైన మహిళలుగా తయారవుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల విజయగాథలు చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇంటిని సమర్థంగా నిర్వహించడంలో మహిళలు చాలా బాగా పనిచేస్తారని కొనియాడారు. ఇంటిలో నిజమైన ఆర్థిక మంత్రులు మహిళలేనని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దేశానికే ఆర్ధిక మంత్రిగా ఉంటూ సమర్థంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడారు. త్వరలో ఏపీ హైకోర్టుకు కూడా మహిళ ప్రధాన న్యాయమూర్తి వస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ మహిళా పక్షపాతినేనని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తాను, పవన్ కల్యాణ్ అంతా మహిళా అభ్యున్నతికే పనిచేస్తున్నామని తెలిపారు.


జగన్ హయాంలో విధ్వంసం..

జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ విధ్వంసమైందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ పున: నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఉద్ఘాటించారు. మహిళా విశ్వవిద్యాలయం తీసుకురావడం, స్థానిక సంస్థల్లో 8 శాతం మహిళలకు రిజర్వేషన్లను ఎన్టీఆర్ తీసుకొచ్చారని ప్రస్తావించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అయి చట్టసభల్లో సమర్థవతంగా పనిచేసేందుకు మహిళలకు మంచి అవకాశాలు వస్తున్నాయని వివరించారు. మగవారి కంటే ఎక్కువగా ఆదాయాన్ని మహిళలే సంపాదిస్తున్నారని తెలిపారు. 1997లో ఆడపిల్లల సంరక్షణ పథకాన్ని ప్రారంభించి.. ఆడబిడ్డల పేరిట రూ.5 వేలు డిపాజిట్ చేశామని గుర్తుచేశారు. 8,9,10 తరగతులు చదివే ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసి ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు పునాది వేసింది తానేనని తెలిపారు. కుటుంబంలో మహిళలకు నాయకత్వం ఇచ్చేలా అనేక చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 02:27 PM