Share News

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Mar 14 , 2026 | 07:25 AM

మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..
Perni Nani

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మచిలీపట్నంలో (Machilipatnam) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ (Jana Sena Party) జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘటనలో వైసీపీ నేత బొర్రా విఠల్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని (Perni Nani) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద పేర్ని నాని చేసిన హంగామా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


జనసేన జెండా దిమ్మ వివాదంతో ఉద్రిక్తత..

గత రెండు రోజులుగా మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రామానాయుడుపేట సెంటర్‌లో జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ జెండా దిమ్మ నిర్మించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ నిర్మాణాన్ని వైసీపీకి చెందిన స్థానిక నేత బొర్రా విఠల్ అడ్డుకున్నట్లు సమాచారం. దీనితో అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.


బొర్రా విఠల్ అరెస్ట్..

రామానాయుడుపేట సెంటర్‌లో జరిగిన వివాదం నేపథ్యంలో పోలీసులు వైసీపీ నేత బొర్రా విఠల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను గూడూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని వెంటనే తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.


గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద పేర్ని నాని హంగామా..

పోలీస్ స్టేషన్‌కు తన అనుచరులతో వెళ్లిన పేర్ని నాని అక్కడ కాసేపు హంగామా చేశారు. బొర్రా విఠల్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేసి బొర్రా విఠల్‌ను విడుదల చేశారు. అయినప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. పోలీసులకు పేర్ని నాని తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. రాజకీయంగా ఒక పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరించరని ఆయన ఆరోపించారు.


రామానాయుడుపేట సెంటర్‌కు వెళ్లిన పేర్ని నాని..

పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత పేర్ని నాని నేరుగా మచిలీపట్నంలోని రామానాయుడుపేట సెంటర్‌కు వెళ్లారు. అప్పటికే పోలీసులు ఆప్రాంతంలో భారీగా మోహరించారు. అక్కడున్న పోలీసులపై కూడా పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యకలాపాలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఒక పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్ని నాని హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో కూడా ఆయన గట్టిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పేర్ని నాని హెచ్చరికలతో అక్కడ ఉన్న ఆర్‌పేట, చిలకలపూడి సీఐలు మౌనంగా ఉండిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.


మచిలీపట్నంలో పరిస్థితి ఉద్రిక్తం..

ఈ ఘటనతో మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు పార్టీల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోడంతో మరింత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు.. ఆ రైతుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

విద్యార్థులకు నాణ్యతలేని భోజనం.. మంత్రి లోకేశ్ ఆగ్రహం

ఉద్దానం కిడ్నీ బాధితులకు ప్రభుత్వం చారిత్రాత్మక పరిష్కారం.. తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 14 , 2026 | 07:33 AM