విజయవాడలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కనకదుర్గమ్మ దర్శనం
ABN , Publish Date - Oct 17 , 2026 | 07:32 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఏడో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు.
విజయవాడ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో ఏడో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దేవిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. అన్ని క్యూ లైన్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
భక్తులు పెద్దస్థాయిలో గుడికి తరలిరావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి సుమారుగా మూడు గంటల సమయం పడుతోంది. ఈరోజు (శనివారం) సాయంత్రం దుర్గమ్మను మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ దర్శించుకోనున్నారు. అనంతరం పున్నమిఘాట్లో విజయవాడ ఉత్సవ్ 2.0లో మధ్యప్రదేశ్ సీఎం పాల్గొననున్నారు.
కనకదుర్గ అమ్మవారిని దర్శిచుకోనున్న చైనా రాయబారి జు ఫీహాంగ్ దంపతులు..
చైనా రాయబారి ఈరోజు (శనివారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. భారత - చైనా రాయబారి జు ఫీహాంగ్ తన సతీమణి టాన్ యుక్సియుతో కలిసి నేడు, రేపు ఏపీలో అధికారిక పర్యటన చేయనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని ఈరోజు ఉదయం 8.15కు చైనా రాయబారి దంపతులు దర్శించుకోనున్నారు. అనంతరం అమరావతిలోని మహాస్తూపం, పురావస్తు శాఖ (ASI) మ్యూజియంతో పాటు భారీ బుద్ధ విగ్రహాన్ని ఉదయం 10 గంటలకు చైనా రాయబారి సందర్శించనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చైనా రాయబారి జు ఫీహాంగ్ సమావేశం కానున్నారు. రాత్రి 7:30 గంటలకు ‘సారస్’ (SARAS), విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను చైనా రాయబారి వీక్షించనున్నారు. అక్టోబరు 18వ తేదీన ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనా రాయబారి జు ఫీహాంగ్ దంపతులు తిరుగుపయనం కానున్నారు.
శ్రీశైలంలో..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఏడోరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. గజవాహనంపై ఆసీనులై ప్రత్యేకంగా ఆది దంపతులు పూజలందుకొనున్నారు. ఇవాళరాత్రి క్షేత్ర పురవీధుల్లో స్వామి, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
ద్వారకాతిరుమలలో..
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో ఏడోరోజు ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు మహాలక్ష్మి అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News