మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:26 AM
మహిళలు ఆర్థికంగా ఎదగాలనేదే తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతగానో చేయూతనిస్తోందని పేర్కొన్నారు.
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా ఎదగాలనేదే తమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) వ్యాఖ్యానించారు. మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంతగానో చేయూతనిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రగతికి కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. స్త్రీ శక్తి ద్వారా ఆయా ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తున్నామని వివరించారు. ఈరోజు (శుక్రవారం) విజయవాడ స్టెల్లా కళాశాల సమీపంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్, ఆ ట్రస్ట్ రక్త నిధి కేంద్రాన్ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గత ఏడాది ఈ భవనాలకు శంకుస్థాపన చేసి, నిర్మాణాలను ట్రస్ట్ పూర్తి చేసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని పేదలకు సేవలందించేలా తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
ఈ ట్రస్టు ప్రారంభమైన మరుసటి ఏడాది నుంచే ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పేదలకు వైద్యసేవలు అందించేలా ఎన్టీఆర్ ఆరోగ్య రథాలతో మొబైల్ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరంలలో బ్లడ్ సెంటర్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవాడలోనూ బ్లడ్ సెంటర్ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. గత ఏడాదే తలసేమియా లోపం ఉన్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించే సేవలను మొదలుపెట్టారు. ప్రస్తుతం విజయవాడలోనూ తలసేమియా కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.
రక్తదానం మనిషి జీవితానికి ఇచ్చే భరోసా..
సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి వెల్లడించారు. తాను కూడా ప్రజలను ఇదే విషయాన్ని కోరుతున్నానని... అందరూ సహకారం అందించాలని సూచించారు. తమకు సహకారాన్ని అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం ద్వారా ప్రజలకు ఓ భరోసా ఇస్తున్నామని తెలిపారు. ఒక ప్రాణానికి మరో ప్రాణం సాయంతో కొత్త జీవితం అందించే రోజు అని చెప్పుకొచ్చారు. రక్తదానం అనేది మరో మనిషికి ఇచ్చే జీవిత భరోసా అని వెల్లడించారు. ఎంతో బాధ్యతతో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను ముందుకుతీసుకెళ్తాం..
మా నాన్న నందమూరి తారకరామారావు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని నారా భువనేశ్వరి తెలిపారు. ‘సమాజంలో ఉన్న చివరి వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వారని... ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటైంది. 29 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. ఎంతో చేసినా... ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రజలు కూడా మా ట్రస్టుతో చేయి కలిపి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మా ట్రస్ట్ సమాజంలో బాధ్యతతో పని చేస్తోంది. నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉండటం నా అదృష్టం. ఈ ట్రస్టు సేవ చేసే మనసున్న ప్రతి ఒక్కరిదీ. ఆరోగ్య రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా గ్రామాలు, ట్రైబల్ ఏరియాల్లో మొబైల్ వాహనాల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అనేక గ్రామాలకు ఇస్తున్నాం. సేవా కార్యక్రమాలను సంఖ్యలతో కొలవకండి. ఎంత మందిలో మార్పు వచ్చిందో ఆలోచించండి. మేము ఇన్ని చేశామని, అన్ని చేశామని చెప్పుకోం. ఈ విషయాలు కూడా మాతో కలిసి వచ్చి మీరు కూడా సేవల్లో పాల్గొనాలి’ అని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.
బాధితులకు మా ట్రస్ట్ అండగా నిలిచింది..
మంచి విద్య అంటే సర్టిఫికెట్ ఇవ్వడం కాదని.. వారి జీవితాలకు బంగారు భవిత ఇవ్వడమని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ‘మెరిట్ ఉన్న వారిని ప్రోత్సహించడం ద్వారా వారి కుటుంబం, సమాజం ఎదుగుతుంది. వరదలు, తుఫాన్, విపత్తులు వచ్చిన సమయంలో బాధితులకు మా ట్రస్ట్ అండగా నిలిచింది. రక్తదానం వల్ల ఒక మనిషికి ప్రాణం పోస్తున్నారనే వాస్తవాన్ని అందరూ గమనించాలి. రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలి. తలసేమియాతో బాధపడేవారి కోసం మావంతు అండగా నిలుస్తున్నాం. ప్రజలు, సంస్థలు కూడా తలసేమియా బాధితులకు భరోసా ఇచ్చేలా నిలబడాలి. విజయవాడ వంటి నగరంలో నాణ్యమైన బ్లడ్ సెంటర్ అవసరమని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎన్టీఆర్ బ్లడ్ సెంటర్ను నేడు ప్రజలకు అంకితం చేస్తున్నాం. రక్తదాతల మంచి మనస్సు ద్వారా మరో మనిషి ప్రాణాలు నిలబడతాయి. ప్రతి రక్తదాతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఆరోగ్యంగా ఉన్న సమయంలో రక్తదానం చేయండి. మీచుట్టూ ఉన్న వారిని కూడా రక్తదానం చేసేలా ప్రోత్సహించాలి’ అని నారా భువనేశ్వరి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News