రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Oct 14 , 2026 | 09:56 AM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలపై వైసీపీ నేతలు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నెల్లూరు జిల్లా, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలపై వైసీపీ నేతలు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (బుధవారం) నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వార్డుల విభజన, రిజర్వేషన్ ప్రక్రియ చట్టప్రకారం చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా అధికారులు పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారని స్పష్టం చేశారు. బీసీ కోటాలో మేయర్గా పోటీ చేయాలని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ భావించారని.. అలా అని తాము బీసీ రిజర్వేషన్ చేయలేదని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు..
రోస్టర్ ప్రకారం మేయర్ స్థానం రిజర్వేషన్ ఓసీ జనరల్ అయిందని.. రూప్ కుమార్ డివిజన్ సైతం బీసీ మహిళ రిజర్వేషన్ అయిందని మంత్రి నారాయణ వెల్లడించారు. తన నియోజకవర్గంలో చాలా డివిజన్ల రిజర్వేషన్లు మారిపోయాయని చెప్పుకొచ్చారు. మంత్రిగా తాను అనుకుంటే మార్పులు చేసి ఉండవచ్చని.. కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. నిబంధనల ప్రకారం ముందుకెళ్లమని కలెక్టర్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి చేసే వాళ్లను ఆదరించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.