Share News

యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:53 PM

వికసిత్ భారత్‌–2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు.

యువత ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి: మంత్రి సత్యకుమార్
AP Minister Satya Kumar Yadav

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్‌–2047 నిర్మాణంలో విద్యార్థులే కీలకమని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తోందని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాష్ట్రస్థాయి పోటీలను ఈరోజు (శనివారం) విజయవాడలో బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, తదితర పోటీలను మంత్రి సత్యకుమార్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని.. వారే రేపటి దేశ నిర్మాతలు, నాయకులు అని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని వివరించారు.


భారత్‌ను అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలి..

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. 2047 నాటికి స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలను జరుపుకోనుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. అప్పటికీ భారతదేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. దేశాభివృద్ధిలో యువత ఆలోచనలు, ఆవిష్కరణలు, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. వైద్య కళాశాలలు, వైద్య విద్యలో సీట్లు, ఉన్నత విద్యాసంస్థల విస్తరణతో విద్యార్థులకు అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌ వంటి సంస్థల విస్తరణ దేశ మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడుతోందని చెప్పారు.


ఎగుమతులను పెంచే దిశగా దేశం ముందుకు సాగాలి..

పీఎం శ్రీ పాఠశాలలు, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపయోగపడుతున్నాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. స్టార్టప్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి కార్యక్రమాలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. సెమీకండక్టర్లు, లిథియం బ్యాటరీలు, అరుదైన ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. యువత కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు స్థాపించి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ఎగుమతులను పెంచే దిశగా దేశం ముందుకు సాగాలని అభిలాషించారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ నిర్మాణంలో యువత భాగస్వాములయ్యేలా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:25 PM