టీడీపీ కమిటీల ప్రకటన.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం
ABN , Publish Date - Apr 15 , 2026 | 11:47 AM
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని నియమించింది.
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని (Nara Lokesh) నియమించింది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్లకు గౌరవం, కొత్తవారికి అవకాశాలు, సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు చేశామని వెల్లడించారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం ఆధారంగా పదవులను ఇవ్వడం జరిగిందన్నారు.
పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు..
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం చేస్తామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు, ప్రతి కమిటీలోనూ కొత్త వారిని నియమించినట్లు వివరించారు. 29 మందితో పొలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీలను నియమించినట్లు చెప్పుకొచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు-3, జాతీయ ఉపాధ్యక్షులు-18, జాతీయ అధికార ప్రతినిధులు-10, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు-7, రాష్ట్ర ఉపాధ్యక్షులు-16, రాష్ట్ర అధికార ప్రతినిధులు-14, రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్ల-10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు-59, రాష్ట్ర కార్యదర్శులు-77, నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరి చొప్పున నియమించినట్లు వెల్లడించారు.
కష్టపడిన వారికి, విధేయులకు పెద్దపీట..
అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పుపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గతానికి భిన్నంగా పార్టీ కమిటీల కూర్పును సీఎం కొత్త పుంతలు తొక్కించారని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా చెబుతున్నట్లే టీడీపీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి, ఓ క్లస్టర్ ఇన్‌చార్జికి నేరుగా పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ పొలిట్ బ్యూరోలో గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్‌చార్జి గుత్తికొండ ధనుంజయ్ చోటు దక్కించుకున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ... 50 మంది మహిళలకు చోటు, పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించామని పేర్కొన్నారు.
అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు..
జనాభా దామాషా పద్ధతిన, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కమిటీల కూర్పు చేసినట్లు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది బడుగులకు టీడీపీ హై కమాండ్ స్థానం కల్పించిందని తెలిపారు. బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13 మందికి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినట్లు వివరించారు. బీసీలకు 40 శాతం, ఎస్సీలకు 25 శాతం, ఎస్టీలకు 3.8 శాతం, మైనార్టీలకు 7 శాతం చొప్పున కమిటీలో టీడీపీ అధినాయకత్వం స్థానం కల్పించిందని అన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లో విశ్లేషించి కమిటీల కూర్పు చేశామని తెలిపారు. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియమకాలు చేపట్టామని అన్నారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, 33 శాతం మహిళా రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ కమిటీల కూర్పు చేశామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News