Share News

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:25 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

ఫడణవీస్‌తో పవన్ భేటీ.. ఏపీకి రెండు ఆడపులులు ఇవ్వడంపై కృతజ్ఞతలు
Pawan Kalyan

ఇంటర్నెట్ డెస్క్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో (Maharashtra CM Fadnavis) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముంబైలో ఈరోజు (మంగళవారం) భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై ఈ సమావేశంలో ఇరువురు నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడపులులు ఇస్తున్నందుకు ఫడణవీస్‌‌కి.. పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై వీరిద్దరు మాట్లాడారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి ఏపీకి రెండు ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని ఈ సమావేశంలో వారు నిర్ణయం తీసుకున్నారు.

PAWAN-2.jpg


ఆడపులుల సంఖ్య తగ్గింది..

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీలోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ఆడపులులను ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

PAWAN-5.jpg


ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది..

తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చరిత్రలో ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. తూర్పు కనుమల్లో ఆడపులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. తద్వారా తూర్పు కనుమల్లో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని వివరించారు. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయనే అంశాన్ని ఈ సంయుక్త సంరక్షణ కార్యాచరణ ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

PAWAN-3.jpg


వారి సమన్వయంతో ముందుకెళ్తాం

ఆంధ్రప్రదేశ్ – మహారాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమల్లో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

PAWAN.jpgPAWAN-4.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక సూచనలు

జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 12:28 PM