ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:35 PM
ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satya Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలిపారు. ఈ సమయంలో ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈరోజు (శనివారం) మీడియాతో మంత్రి అనగాని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలే అజెండాగా బొప్పరాజు పనిచేస్తున్నారా...? లేక పొలిటికల్ అజెండాతో పని చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. బొప్పరాజు వ్యవహర శైలిపై పలు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులకు - ప్రభుత్వానికి ఉన్న సఖ్యతను చెడగొట్టడానికి బొప్పరాజు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నాం..
జగన్ హయాంలో పెట్టిన బకాయిలనూ కూటమి ప్రభుత్వమే పెట్టిందనే రీతిలో బొప్పరాజు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని ఆగ్రహించారు. రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం చూస్తుంటే బొప్పరాజు ఆలోచనా ధోరణి ఏంటో అర్థమవుతోందని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై బొప్పరాజుతో సహా వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఆర్థిక కష్టాలున్నా... ప్రభుత్వం ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలోని పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని అన్నారు.. ఇంకా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 11 వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తింపచేశామని స్పష్టం చేశారు. సీపీఎస్ కాంట్రిబ్యూషన్‌ను వైసీపీ హయాంలో సొంత అవసరాలకు వాడుకుంటే... తిరిగి వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.
ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మును వాడుకున్నారు..
ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మును కూడా జగన్ హయాంలో తమ అవసరాలకు వాడుకున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. వాటిని తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో తాము వేశామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ తాము చెల్లించామని స్పష్టం చేశారు. ఇవే కాకుండా ఇంకా చాలా చేశామని అన్నారు. విడతల వారీగా వేల కోట్లు ఉద్యోగుల బకాయిల నిమిత్తం చెల్లిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను తాము గౌరవిస్తున్నామని, చర్చలు జరుపుతున్నామని అన్నారు. జగన్ హయాంలో రివర్స్ పీఆర్సీ ఇచ్చారని.. జీతాల్లో నుంచి రికవరీ పెట్టారని... ఇలాంటి వాటిని బొప్పరాజు మరిచారో.. మరిచినట్లుగా నటిస్తున్నారోనని ఎద్దేవా చేశారు.
బొప్పరాజు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారు..
జగన్ హయాంలోని పాపాలను కూడా కూటమి ప్రభుత్వం ఖాతాలో వేసి బొప్పరాజు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు. బొప్పరాజు వ్యవహరశైలిని ఉద్యోగులూ గమనించాలని కోరారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న పనులను అడ్డుకునేలా బొప్పరాజు వ్యవహర శైలి ఉందని ఆగ్రహించారు. ఉద్యోగుల అజెండా కంటే.. పొలిటికల్ అజెండానే బొప్పరాజు అమలు చేస్తున్నట్లుగా కన్పిస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబును అవమానించేలా, అవహేళన చేసేలా బొప్పరాజు సభ నిర్వహించారని మండిపడ్డారు. ఉద్యమాలు చేయడాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని సహిస్తాం కానీ... కుట్ర పూరితంగా సీఎంను అవహేళన చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. బొప్పరాజుతో సహా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జగన్ ఏ విధంగా వ్యవహరించారో... చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఉద్యోగులు గమనించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News