గుంటూరు మిర్చికి చైనా షాక్.. మూడు కంటైనర్ల తిరస్కరణ
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:32 PM
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు.
గుంటూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కు పంపించారు. మిర్చిలో అనుమతించిన పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా మిర్చిలో మిథామిడోపాస్ అనే పురుగుమందు అవశేషాలు అధిక స్థాయిలో ఉన్నట్లు చైనా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఈ రసాయన అవశేషాలు ఉండటంతో ఎగుమతి సరుకును తిరస్కరించినట్లు సమాచారం. ఈ పరిణామం గుంటూరు మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. చైనా వంటి కీలక మార్కెట్ తిరస్కరించడం వల్ల భవిష్యత్తు ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, రైతు సంఘాలు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిర్చిలో అవశేషాలు గుర్తించిన మిథామిడోపాస్ కలిగిన పురుగుమందులపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయ పురుగుమందులపై అవగాహన కల్పించాలని, ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పంట ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎగుమతి మార్కెట్లలో కఠినమైన నాణ్యత ప్రమాణాలు అమల్లో ఉన్నందున పురుగుమందుల వినియోగంలో రైతులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు తెలిపాయి. లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో గుంటూరు మిర్చి ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ అడ్డుకుంటోంది.. కొల్లు రవీంద్ర ధ్వజం
ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News