Share News

షోకాజ్ నోటీసు.. టీడీపీ హైకమాండ్‌కు ఎంపీ పుట్టా మహేశ్ వివరణ

ABN , Publish Date - Mar 20 , 2026 | 08:20 PM

ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

షోకాజ్ నోటీసు.. టీడీపీ హైకమాండ్‌కు ఎంపీ పుట్టా మహేశ్ వివరణ
Eluru MP Putta Mahesh

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్‌ డ్రగ్స్ కేసు ఉదంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇద్దరు కీలక రాజకీయ నేతలు ఈ కేసులో ఇరుక్కోవడం, వారికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 'పాజిటివ్' అని తేలడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధానంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల పేర్లు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది.


టీడీపీ హైకమాండ్ సీరియస్..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.. క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడమే కాకుండా, పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంతో టీడీపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణించింది.


సీల్డ్ కవర్‌లో ఎంపీ వివరణ..

టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను హైకమాండ్ ఎంపీ మహేశ్ కుమార్‌కు షోకాజ్ (Show Cause) నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఎంపీ, తన వివరణను ఒక సీల్డ్ కవర్‌లో పార్టీ కార్యాలయానికి పంపారు. ఈ లేఖను అందుకున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెంటనే చంద్రబాబుకి పంపించారు. ప్రస్తుతం ఈ లేఖలో ఎంపీ ఏం వివరణ ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.


ఎంపీపై చంద్రబాబు ఆగ్రహం..

డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పట్టుబడిన వ్యవహరంపై చంద్రబాబు మొదటి నుంచి సీరియస్‌గా ఉన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఎంపీ పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.


మొయినాబాద్ ఘటన: అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగినట్లు సమాచారం రావడంతో ఈగల్ బృందం (Eagle Team) రంగంలోకి దిగింది. పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్

నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 09:02 PM