ఏపీకి అక్వాన్ ముప్పు.. నెల్లూరు - విశాఖ మధ్య తీరం దాటే ఛాన్స్
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:12 AM
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్ బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. నెమ్మదిగా తీవ్ర తుపాను కదులుతోందని తెలిపారు.
అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్ బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. నెమ్మదిగా తీవ్ర తుపాను కదులుతోందని తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఈ తుపాను కదులుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది చెన్నైకు 580 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 610 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 610 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని అన్నారు.
ఎల్లుండి (శుక్రవారం) మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖపట్నంల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఆర్టీజీఎస్ - విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో తుపాను పయనంపై నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. తుపాను గమనంపై ఎప్పటికప్పుడూ జిల్లా యంత్రాంగానికి తగిన సూచనలు జారీ చేస్తామని అన్నారు.
అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF), స్థానిక అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు (గురువారం), ఎల్లుండి (శుక్రవారం) కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్వాన్ తుపాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని జెన్కో అధికారులు అంచనా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా బలిమెల రిజర్వాయర్ నుంచి 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. గుంటవాడ రిజర్వాయర్ 10 గేట్లు ఎత్తి 10,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని అన్నారు. డొంకరాయి రిజర్వాయర్ గేట్లు ఏ క్షణంలోనైనా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే మూడుసార్లు సైరన్ మోగించినట్లు వెల్లడించారు. డొంకరాయి రిజర్వాయర్ ఆరో నంబర్ గేటు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని జెన్కో అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News