బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:57 AM
అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బలపడిందని వెల్లడించారు. గడిచిన 9 గంటల్లో తుపాను స్థిరంగా కేంద్రీకృతమైందని తెలిపారు.
అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ ఈరోజు (మంగళవారం) ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను బలపడిందని వెల్లడించారు. గడిచిన 9 గంటల్లో ఇది స్థిరంగా కేంద్రీకృతమైందని తెలిపారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చెన్నైకు 610కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో అక్వాన్ కేంద్రీకృతమైందని వివరించారు.
పశ్చిమ - వాయవ్య దిశలో ప్రయాణిస్తూ ఎల్లుండి (గురువారం) ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని ప్రాంతాల మధ్య అక్వాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120-130 కిలోమీటర్లు, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. అక్వాన్ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో రేపు (బుధవారం) కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు.
గురు, శుక్రవారాల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అక్వాన్ సమస్యల పరిష్కారం కోసం 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ - 9552300009లో సంప్రదించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు - 112, 1070, 18004250101లను సంప్రదించాలని అన్నారు. కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై
రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News