CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:09 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.
అమరావతి, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పుట్టుకే ఫేక్ అని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టుకున్నారని.. అలాంటి పార్టీతో పోరాడటం దౌర్భాగ్యమని విమర్శించారు. ఇప్పుడేమో క్రెడిట్ చోరీ అంటూ అసత్య వార్తలు రాస్తున్నారని.. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని.. అందులోనూ క్రెడిట్ చోరీ అంటూ రాస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.
విష ప్రచారం చేస్తున్నారు..
తాను చాలా రాజకీయాలు చూశానని కానీ.. జగన్ అండ్ కో పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వివేకా రెడ్డిని హత్య చేసిన నేరస్థులను కాపాడుతున్న పార్టీని ఏమనాలి? అని ప్రశ్నించారు. ఆ పార్టీ నేతలు తప్పులు చేసి కూడా తమను విమర్శిస్తున్నారని ఆగ్రహించారు.
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. పల్నాడులో మొన్న ఒక గొడవ జరిగితే కావాలని టీడీపీ నేతలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. గిల్లిగజ్జాలు పెట్టుకుంటే మర్యాదగా ఉండదని.. తన దగ్గర ఇవన్నీ సాగవని హెచ్చరించారాయన.
వ్యక్తిత్వ హనానికి పాల్పడితే..
సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హనానికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ఎవరి జోలికి రానని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అంతం చేసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. పల్నాడులోనూ పూర్తి ప్రక్షాళన చేసి వయలెన్స్ లేకుండా శాంతియుత ప్రాంతంగా మార్చుతామన్నారు. పల్నాడు ప్రాంతానికి తాను వెళ్లాలంటే గతంలో తన ఇంటి గేటుకు తాళ్లుకట్టి గేట్లు మూశారని.. ఆ తాళ్లే వారికి ఉరితాళ్లు అవుతాయని చెప్పానని ప్రస్తావించారు. వైసీపీ హయాంలో శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి రాజ్యమేలాయని చంద్రబాబు విమర్శించారు.
మోదీ సత్తా చాటారు..
‘టీడీపీ కార్యకర్తలను చూసుకునే బాధ్యత.. అధినేతగా నాపై ఉంది. నేను ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఇచ్చిన మేనిఫెస్టోను కుటుంబ సభ్యులైన మీరు ఇంటింటికీ తీసుకెళ్లారు. ప్రభుత్వం మారకుండా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోదీ ప్రధాని అయి భారతదేశం సత్తా చాటారు. గుజరాత్‌లో ఐదుసార్లు బీజేపీ గెలిచింది. దీన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. భోగాపురం విమానశ్రాయానికి 2,500 ఎకరాల భూసేకరణ చేశాం. ఎప్పుడో అయిపోవాల్సిన ప్రాజెక్టును ఐదేళ్ల పాటు జగన్ హయాంలో మూలన పడేశారు. వాటిలో 500 ఎకరాలు తిరిగిచ్చారు. మొదటిసారి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని కూడా తమ ఘనతగా జగన్ అండ్ కో చెప్పుకుంటున్నారు’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధానుల పేరుతో మూడు ముక్కలాట..
‘అమరావతిని శ్మశానం అని, ఏడారి అనీ మాట్లాడారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అట.. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధానా? ఇడుపులపాయలో ఉంటే అదే రాజధాని అవుతుందా.? ఓ పార్టీని నిర్వహించే వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు. మూడు రాజధానులు అని చెప్పిన చోట ఎన్డీయే అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలిచారు. ఏపీ రాజధాని అమరావతే అని గర్వంగా, కాలర్ ఎగరేసి చెప్పుకుందాం. దేవతల రాజధాని అమరావతి.. ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నాన్ని నంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుపతి మెగా సిటీగా అవతరిస్తుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More AP News And Telugu News