Share News

CM Chandrababu: బకాయిలు చెల్లించి.. ఉద్యోగులకు నిజమైన సంక్రాంతినిచ్చాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 18 , 2026 | 01:59 PM

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా.. 80 శాతం ఫిర్యాదులు భూములపైనే ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కొంత మంది క్రెడిట్ చోరీ అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.700 కోట్లు ఖర్చుపెట్టి సర్వే రాళ్లపై వాళ్ల ఫొటోలు వేసుకున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu: బకాయిలు చెల్లించి.. ఉద్యోగులకు నిజమైన సంక్రాంతినిచ్చాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

అమరావతి, జనవరి 18: తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. అప్పట్లో 'మదరాసి' అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటుందని ప్రపంచానికి గుర్తుచేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు.


అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ రాకముందు చదువు లేని వ్యక్తులే రాజకీయాల్లో ఉండేవారని గుర్తు చేశారు. చదువుకున్నవారికే ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. త్వరలో మరో 700 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఈ ఉగాదికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. సమర్థవంతంగా సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చినమాట ప్రకారం.. ఈ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మన పూర్వీకుల భూమికి గత పాలకుల ఫొటోలు పెట్టుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఎక్కడికి వెళ్లినా.. 80 శాతం ఫిర్యాదులు భూములపైనే ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. కొంత మంది క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారని.. రూ.700 కోట్లు ఖర్చుపెట్టి సర్వే రాళ్లపై వాళ్ల ఫొటోలు వేసుకున్నారంటూ వైసీపీ అధినేత జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించి.. నిజమైన సంక్రాంతి ఇచ్చామన్నారు. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని వివరించారు.


ఎన్టీఆర్ వచ్చాకే కృష్ణా మిగులు జలాల్లో మనకు హక్కు ఉందని స్పష్టం చేశారని సీఎం గుర్తుచేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని ఎన్టీఆర్ చెప్పారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వానికి పూర్తిగా సహకరిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్నామన్నారు. ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదన్న ఆయన.. దేశం, రాష్ట్రం బాగుండాలనే కోరుకున్నామని అన్నారు. గొంతు మీద కత్తి పెట్టి టీడీపీని వీడమంటే.. ప్రాణాలు వదిలే కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారని చంద్రబాబు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..

మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

For More AP News And Telugu News

Updated Date - Jan 18 , 2026 | 03:19 PM