CM Revanth Reddy: మేడారం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:17 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అంతకుముందు అంటే.. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఆయన ఈ రోజు పర్యటించనున్నారు.
హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆది, సోమవారాల్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం ఆయన విదేశాలకు పయనం కానున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఖమ్మంలోని ఎదులాపురంకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు ఎదులాపురం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.00 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడ భోజనం చేసి.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 3.00 గంటలకు సీపీఐ పార్టీ మీటింగ్‌కు సీఎం రేవంత్ హాజరు కానున్నారు.
సాయంత్రం 4.00 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి సీఎం రేవంత్ బయలుదేరి వెళ్లనున్నారు. 4.30 గంటలకు మేడారం చేరుకుంటారు. స్థానిక పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించనున్నారు. అనంతరం స్థానిక హరిత హోటల్‌లో జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత.. మేడారంలోని జంపన్న వాగు, పోలీస్ కమాండ్ సెంటర్, వై.జంక్షన్, స్తూపం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారు.
ఈ రోజు రాత్రి మేడారంలోనే సీఎం రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు.. అంటే సోమవారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్య మేడారంలోని అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత 7.40 గంటలకు తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు పయనం కానున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.45 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం వెళ్లనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..
మహానాయకుడికి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More TG News And Telugu News