NTR: మహానాయకుడికి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:46 AM
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
హైదరాబాద్: తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు ఆయన అభిమానులు, టీడీపీ కేడర్ భారీగా పోటెత్తారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వీరు తమ ఎక్స్ ఖాతాల వేదికగా నివాళులు అర్పించారు.
కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని అభివర్ణించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శమని తెలిపారు. ఆయన వేసిన బాట అనుసరణీయని వివరించారు. మరొక్కమారు ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.
తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్య: మంత్రి నారా లోకేశ్
తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయకు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫొటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కిన అరుదైన వరమన్నారు. 'భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్న తాతయ్యా.. మీ జన్మ ధన్యమయ్యా' అని మంత్రి లోకేశ్ ప్రశంసించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని.. ఎన్టీఆర్ కు లోకేశ్ నివాళులర్పించారు.
మరోవైపు.. ప్రముఖ హీరోలు నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సైతం ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించారు. ఇక ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, ఈనగాల పెద్దిరెడ్డి, బాబూమోహన్ తదితరులు నివాళులర్పించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఘాట్‌కు చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More AP News And Telugu News