Anagani Satyaprasad: బలహీన వర్గాల వారిని నాశనం చేసిన జగన్: మంత్రి అనగాని
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:36 PM
శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ పార్టీ మారిందంటూ వైసీపీపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు.
అమరావతి, జనవరి 18: కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండగను వైభవంగా జరుపుకున్నారని.. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంకా సైకో ఆలోచనల్లోనే ఉన్నారని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చిత్రసీమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ నేతల వైఖరిని ఎండగట్టారు. శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా వైసీపీ మారిందంటూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఆదివారం దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్తున్నారన్నారు. చంద్రబాబు ఆలోచనలు ఎపుడు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపైనే ఉంటాయని అనగాని అన్నారు.
వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా.. జంతు బలులు చేశారని మంత్రి విమర్శించారు. నాయకుడికి ఏది నచ్చుతుందో అదే వైసీపీ వాళ్లు చేశారని.. అది వారి నైజమని అభివర్ణించారు. గత ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు తీసివేశారన్నారు. బలహీనవర్గాల వారిని నాశనం చేశాడంటూ జగన్‌పై నిప్పులు చెరిగారు. మహిళలను జగన్ ప్రభుత్వం కించపరిచిందంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తోందని కుండబద్దలు కొట్టారు. ఎపుడో జరిగిన జల్లికట్టు ఫొటోలు, వీడియోలను వైసీపీ సైకోలు ట్రోల్ చేశారని గుర్తుచేశారు. పల్నాడులో రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని పార్టీకి అంటగట్టేందుకు వైసీపీ పాకులాడిందని చెప్పారు. తప్పుచేసిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.
సినీ, రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ విప్లవం: మంత్రి నారాయణ
సినీ, రాజకీయ చరిత్రలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఓ విప్లవం సృష్టించారని మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి నారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అందరికీ కూడు, గూడు, గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అనేక పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన చేపట్టిన పథకాలను నేటికీ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. మంచి నాణ్యతతో కూడిన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎంతో మంది యువకులకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ.. తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవం నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు ప్రజల రోషాన్ని, పౌరుషాన్ని ప్రపంచానికి చాటారన్నారు. దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తెచ్చి.. తద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ మనకు దూరమై 30 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ప్రజలు ఆయన సేవలు మరువలేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ బాటలోనే టీడీపీ కార్యకర్తలు నడుస్తున్నారని ఆమె వివరించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది రక్తదానం చేశారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి గొంతుకనిచ్చిన అసాధారణ నేత ఎన్టీ రామారావు అని హోంమంత్రి వంగలపూడి అని అభివర్ణించారు. అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపిన అసామాన్య నాయకుడంటూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ అంటే ఈ తరానికి పుస్తకాలలో చదివిన చరిత్ర కాదని.. చిన్నప్పటి నుంచీ వారిపై ప్రభావం చూపిన మహా వ్యక్తి అని పేర్కొన్నారు. తెరమీద ఆయన్ను దేవుడిగా చూసినవాళ్లు.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా అలాగే పూజించారని వివరించారు.
ఆత్మగౌరవం అనేది అప్పుడో రాజకీయ నినాదం మాత్రమే కాదు.. ఎన్టీఆర్ ఢిల్లీని ఢీకొట్టిన తీరు.. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని హోంమంత్రి వివరించారు. రాష్ట్రాలు తలవంచి నిలబడే కాలంలో తెలుగు ప్రజల తరఫున తలెత్తి నిలబడిన నాయకుడని ప్రశంసించారు. పేదవాడి ఆకలి గురించి మొదటిసారి ఆలోచించింది ఎన్టీఆర్ ప్రభుత్వ కాలంలోనే అంటూ వివరించారు. ప్రస్తుతం.. మనం అమలుచేస్తున్న అమ్మ ఒడి, పేదవాడి ఇంటికి బియ్యం, ఆడబిడ్డల గౌరవం, గ్రామాలకు గుర్తింపు.. ఇవన్నీ స్కీమ్స్ కాదని.. ఎన్టీఆర్ ఆలోచన నుంచి వచ్చిన నిర్ణయాలని మంత్రి అనిత గుర్తు చేశారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అండగా నిలబడే వ్యవస్థ అనే భావనను ప్రజలకు కలిగించింది ఎన్టీఆర్ అని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడ చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..
మహానాయకుడికి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..
For More AP News And Telugu News