Tributes To NTR: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:57 AM
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఊరువాడల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి.. సినీ హీరోగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులర్పించారు.
గుంటూరు జిల్లా..
జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, స్థానిక ఎమ్మెల్యే నసీర్, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణతో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భీమవరం..
జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీఐఐసీ ఛైర్మన్, టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చిలకలూరిపేటలోలో..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావూ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కరిముల్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలు.. ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ జన్మదినం రోజున ముగియనున్నాయి.
విశాఖపట్నం..
స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదు, దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు జరగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆయన స్థాపించిన టీడీపీలో తాను ఎంపీగా సేవలందించడం గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు నగరంలోని బీచ్ రోడ్‌లో ఎన్టీఆర్ విగ్రహనికి విశాఖ ఎంపీ శ్రీ భరత్‌తోపాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, జిల్లా అధ్యక్షుడు పట్టాభితోపాటు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.
గంటా శ్రీనివాసరావు..
చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలే దేవాలయం అన్న సిద్ధాంతంతో ముందుకు వెళ్లారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ముందుకు వెళుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతోపాటు సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా..
నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
కర్నూలు జిల్లా..
పత్తికొండ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, టీడీపీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జిల్లా..
బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించిన భగీరథుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో పురోగతితోపాటు పరిశ్రమ ఏర్పాటుతో ఏపీ.. దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతుందన్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, కొండపల్లిలో.. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘనంగా నిర్వహించారు.
శ్రీ సత్యసాయి జిల్లా..
భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్‌దేనని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరి పట్టణంలో స్థానిక సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. పటేల్, పట్వారి వ్యవస్థలకు చరమ గీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పేరు మీద పేదలకు కిలో రూ. 2లకే బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకమని పేర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్ పూజ్యుడు చిరస్మరణీయుడని అభివర్ణించారు. రాజకీయ పార్టీలు.. సేవా కార్యక్రమాలు చేయడం అనేది టీడీపీ ఆవిర్భావం తర్వాతనే వచ్చాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
అనంతపురం జిల్లా..
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయం పరిచయం చేసింది ఎన్.టి. రామారావు అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఆదివారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఎన్. టి. ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 2లకే కిలో బియ్యం అందించిన గొప్ప నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకి అధికారం చేపట్టి రికార్డు సృష్టించిన మహనీయుడు ఆయన అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి ఖ్యాతి, కీర్తి అని స్పష్టం చేశారు. తెలుగువారు ఉన్నంత వరకు మహానేత ఎన్టీరామారావు తెలుగు ప్రజల మదిలో స్థిరస్థాయిగా నిలుస్తారన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం.. కూనవరం రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాయి.
నిజామాబాద్ జిల్లా..
డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఖమ్మం జిల్లా..
ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళలర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడ చదవండి..
మహానాయకుడికి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..
మేడరం పర్యటన ముగించుకుని విదేశాలకు సీఎం..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More AP News And Telugu News