రైతులకు గుడ్‌న్యూస్.. జూన్ 20న ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:13 PM
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu) ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డిలతో ఈరోజు (గురువారం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆక్వా, పొగాకు, మామిడి రైతులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పొగాకు ధర రూ.200 తగ్గకుండా కొనుగోళ్లు జరగాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.
యుద్ధ ప్రభావంతో పొగాకు ధరలు పడిపోయాయి..
తోతాపురి మామిడికి కేజీకి రూ.4 ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 28కంపెనీలు పొగాకు బోర్డు వేలంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారని అన్నారు. ఇకపై ఆక్వా ఫీడ్ ధరలు పెరగాలంటే కమిటీ ద్వారానే నిర్ణయం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడే కమిటీ ధరలు సమీక్షించి నిర్ణయిస్తుందని వివరించారు. పొగాకు రైతులు గత ఏడాది కంటే ఎక్కువ వర్జీనియా రకం సాగు చేయటంతో ధరలపై ప్రభావం చూపిందని అన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కూడా పొగాకు ధరలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. సీఎం చొరవతో 28రకాల పొగాకు కంపెనీలతో చర్చించామని తెలిపారు.
దొంగచాటుగా కొనుగోళ్లు జరిపితే క్రిమినల్ చర్యలు..
పొగాకు బోర్డు వేలంలో కాకుండా దొంగచాటుగా కొనుగోళ్లు జరిపితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఢిల్లీ కూడా వెళ్లి పొగాకు రైతులు నష్టపోకుండా కేంద్రపెద్దలను కూడా కలుస్తామని వెల్లడించారు. తోతాపురి మామిడి రైతులకు గత ఏడాదిలానే టన్నుకు రూ.4వేలు చెల్లిస్తామని అన్నారు. ఆక్వా రైతులపై ఉద్యమ కార్యాచరణ అనటానికి వైసీపీ నేతలకి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. సాయికృష్ణ ఘటనను రాజకీయం చేయటం గొడ్డలి పార్టీకే చెల్లిందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని జగన్ కుల, మతాల మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు నష్టపోయే చర్యలను చేపడితే ఉపేక్షించం: మంత్రి గొట్టిపాటి
పొగాకు బోర్డు వేలంలో అన్ని కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పొగాకు ధరలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. అధిక ఉత్పత్తిని సాకు చూపి ధరలు తగ్గించే చర్యలు చేపట్టడం తగదని అన్నారు. వచ్చే ఏడాది ఎంతమేర పంట వేయాలనేది ముందుగానే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వ్యాపారస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల వద్ద ఉన్న పొగాకుని కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రైతులు నష్టపోయే చర్యలను చేపడితే ఉపేక్షించబోమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News