Share News

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

ABN , Publish Date - Jun 17 , 2026 | 09:18 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Pawan Kalyan

హనుమకొండ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్‌ను.. పవన్ కల్యాణ్ ఈరోజు (బుధవారం) ఉదయం పరామర్శించిన విషయం తెలిసిందే. అతను కోరుకున్న పూడిల్ జాతి కుక్కపిల్లను ఇవాళ సాయంత్రం అతని ఇంటికి పంపించారు.


కుక్కపిల్ల కోరికపై ప్రత్యేక చర్చ..

నిరంజన్‌‌తో పవన్ కల్యాణ్ కాసేపు పలు విషయాలపై చర్చించారు. ఈ సంభాషణలో దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఒక కుక్కపిల్ల గురించే చర్చించారు. తనకు ఒక అందమైన పెంపుడు కుక్క కావాలని, ముఖ్యంగా పూడిల్ జాతికి చెందిన కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరారు. తన ఫోన్‌లో ఫొటో చూపిస్తూ, నటుడు రామ్‌చరణ్ పెంచుకునే పూడిల్ బ్రీడ్‌లాంటి కుక్కపిల్ల కావాలని చెప్పారు. నిరంజన్ కోరిక విన్న వెంటనే పవన్ కల్యాణ్ స్పందించి, అదే జాతికి చెందిన కుక్కపిల్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందికి వెంటనే ఆదేశాలు జారీ చేసి, పూడిల్ బ్రీడ్ కుక్కపిల్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఇవాళ సాయంత్రానికే జనసేన నాయకులు నిరంజన్ ఇంటికి వెళ్లి పూడిల్ కుక్కపిల్లను అందజేశారు. దీంతో నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్..

హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పవన్ కల్యాణ్‌ను ఒక్కసారి కలవాలన్న కోరికను వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.


40 నిమిషాల పాటు అభిమాని ఇంట్లో పవన్..

నిరంజన్ ఇంటికి వెళ్లిన పవన్ కల్యాణ్ దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో ముచ్చటించారు. ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు, వ్యక్తిగత విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో నిరంజన్ తన అభిమాన నటుడు, నాయకుడితో అనేక విషయాలు పంచుకున్నారు. ఓజీ-2 సినిమా చేస్తే నిన్ను స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


నిరంజన్ ధైర్యంపై ప్రశంసలు..

అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం తనను ఎంతో ప్రభావితం చేశాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల మధ్య ఆయన చూపిస్తున్న మనోధైర్యం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుమల వేంకటేశ్వరస్వామి, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు.


తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

తన వరంగల్, హనుమకొండ పర్యటనకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బోనస్ ఇచ్చే 7 రకాల సన్న వడ్లు అందుబాటులో ఉంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 09:54 PM