పిఠాపురం ప్రొటోకాల్ అంశం.. నేతల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:51 PM
పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సీఎం మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నేతలు ప్రొటోకాల్ పేరుతో, ఫ్లెక్సీల్లో ఫొటోల ప్రాధాన్యం కోసం ఘర్షణ పడటం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.
పాడా సమావేశం వివాదం..
పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) సమావేశం సందర్భంగా జరిగిన ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరు సరికాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు.
గొడవలు పడటం సరైన పద్ధతి కాదు: సీఎం
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలకు లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా గొడవలు పడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇలాంటి ఘటనలు కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపుతాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హుకుం జారీ చేశారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన సూచనలు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణను కాపాడాలని, నేతలు వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఐక్యత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. వ్యక్తిగత ఘర్షణలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని సీఎం హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి
ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం
విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News