బీసీలకు 34శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మక నిర్ణయం
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:18 AM
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.
వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం
రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి కుదించారు
అసెంబ్లీలో మంత్రులు సవిత, అచ్చెన్న, కొల్లు ధ్వజం
అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు. తొలుత మంత్రి సవిత మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలినారు. బీసీల అభ్యున్నతి కోసం ఆనాడు ఎన్టీఆర్ కృషి చేశారని, ఆ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు బీసీలకు మొట్టమొదటిసారిగా 1995లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తుచేశారు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీ అని, ఉమ్మడి ఏపీలో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించినవారేనని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ బీసీలకు మేలు చేసేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడంతో 16వేల మందికి పైగా బీసీలు పదవులకు దూరమయ్యారని సవిత ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలపై దమనకాండ: మంత్రి అచ్చెన్న
గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో బీసీలపై దమనకాండ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలో బీసీలపై దాడులు చేసి, వారిని జైలులో పెట్టారని తెలిపారు. బీసీలపై వైఎస్. రాజశేఖర్‌రెడ్డి, జగన్ కక్షగట్టి మరీ ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన జగన్.. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించకుండా వదిలేశారని విమర్శించారు. అక్టోబరు నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అచ్చెన్న స్పష్టం చేశారు.
బీసీల రక్షణకు చట్టం: మంత్రి కొల్లు
బీసీల రక్షణకు చట్టం తెస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చట్ట సవరణతోనే సాధించామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరుగుతుందని, ఇప్పటికే కీలకమైన అంశాల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు.
అన్నిచోట్లా రెడ్లే..: కాలవ, కూన
గత వైసీపీ ప్రభుత్వంలో అన్నిచోట్ల రెడ్లకే ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాస్, కూన రవికుమార్ ఆరోపించారు. టీడీపీ ఎంతోమంది బీసీ నాయకులను తీర్చిదిద్దిందని, ఎర్రంనాయుడు, యనమల, ఈకే కృష్ణమూర్తి లాంటి సీనియర్ బీసీ నాయకుల్ని తయారుచేసిందన్నారు. వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, కోస్తాను వైవీ సుబ్బారెడ్డి, రాయలసీమను మరొక రెడ్డికి అప్పగించేశారని ఆరోపించారు. వైసీపీ తయారు చేసిన నలుగురు బీసీ నాయకుల పేర్లను చెప్పాలని వారు సవాల్ చేశారు. ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అదిరెడ్డి శ్రీనివాస్, పార్థసారథి, వంశీకృష్ణయాదవ్, రాధాకృష్ణ, షాజహాన్ బాషా, రామాంజనేయులు, చదలవాడ అరవింద్ మాట్లాడారు.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News