నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. జగన్ అండ్ కోకి సీఎం చంద్రబాబు వార్నింగ్
ABN , Publish Date - May 23 , 2026 | 01:19 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
చిత్తూరు జిల్లా, మే 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నంగనాచిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని విమర్శించారు. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో తనపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. బాబాయ్ హత్యలో తనపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు.. జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లి, చెల్లిని చూడనివారు ప్రజలకు మంచి చేస్తారా..? అని ప్రశ్నించారు. ఈరోజు (శనివారం) చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. యాదమర్రి ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు.
అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోంది..
ఏపీ అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తి జగన్‌రెడ్డి అని విమర్శించారు. అసత్య ప్రచారాలతో జగన్ అండ్ కో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? అని ప్రశ్నించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకో నాటకమాడుతున్నారని విమర్శించారు. జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదని అన్నారు.హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్.. ముందు నీ ఇంట్లో సమస్యలు చూసుకో..
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రప్పా.. రప్పా అని జగన్ కటౌట్లకు జంతువుల రక్తం చల్లుతున్నారని విమర్శించారు. తన దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. ఇక్కడుంది 1995 నాటి CBN అని ప్రస్తావించారు. జగన్.. ముందు నీ ఇంట్లో సమస్యలు చూసుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. గొడ్డలి పార్టీ బుద్ధి మారట్లేదని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదని చెప్పుకొచ్చారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని పేర్కొన్నారు.
రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యం..
ప్రస్తుతం ప్రజలకు విద్య, వైద్య ఖర్చులు భారంగా మారాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద రూ.25లక్షల వరకూ ఉచిత వైద్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంతానం అంశంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుబడుతున్నారని చెప్పుకొచ్చారు. పిల్లలే తల్లిదండ్రులకు అసలైన ఆస్తి.. అందుకే పిల్లలను కనాలని చెబుతున్నానని అన్నారు. తనకు ప్రజల గురించి తప్ప.. మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం.. ప్రకృతిని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. రాయలసీమలో ప్రతి జిల్లాకు సాగునీరు ఇచ్చామని వ్యాఖ్యానించారు. హంద్రీనీవా నీరును చిత్తూరు జిల్లా వరకు తీసుకెళ్లామని వెల్లడించారు. శ్రీశైలం నీటిని వెంకన్న సన్నిధి వరకు తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు.
పరిశ్రమల హబ్‌గా రాయలసీమ..
పుట్టపర్తికి జెట్ విమానాల తయారీ పరిశ్రమను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారుతోందని చెప్పారు. రాయలసీమలో త్వరలోనే బంగారు గని ప్రారంభంకానుందని వివరించారు. దేశంలోనే అత్యధిక బంగారం ఉత్పత్తి కర్నూలులో జరగనుందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా కూడా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News