Share News

బెంగళూరు యలహంక ప్యాలెస్‌ వద్ద హైడ్రామా.. షర్మిలను లోనికి రానీయకుండా అడ్డుకున్న పోలీసులు

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:58 PM

ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌ నుంచి కుటుంబసమేతంగా బెంగళూరుకు వచ్చారు. షర్మిల వెంట తల్లి విజయలక్ష్మి, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఉన్నారు. యలహంక ప్యాలెస్‌లోనే తన కూతరు అంజలి వివాహం నిర్వహించాలని షర్మిల పట్టుబడుతున్నారు.

బెంగళూరు  యలహంక ప్యాలెస్‌ వద్ద హైడ్రామా..  షర్మిలను లోనికి రానీయకుండా అడ్డుకున్న పోలీసులు
YS Sharmila

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి (YS Sharmila) ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌ నుంచి కుటుంబసమేతంగా బెంగళూరుకు వచ్చారు. షర్మిల వెంట తల్లి విజయలక్ష్మి, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఉన్నారు. యలహంక ప్యాలెస్‌లోనే తన కూతరు అంజలి వివాహం నిర్వహించాలని షర్మిల పట్టుబడుతున్నారు. ఇప్పటికే ప్యాలెస్ విషయంలో దేవనహళ్లి కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఉత్తర్వులతో ప్యాలెస్‌ దగ్గరకు షర్మిలను రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించడంతో హైడ్రామా నెలకొంది.


యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లకుండా షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తుది పరిష్కారమయ్యేవరకు ప్యాలెస్‌ అంశంలో జోక్యం చేసుకోవద్దని షర్మిలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బెంగళూరుకు వైఎస్‌ షర్మిల వచ్చారు. యలహంక ప్యాలెస్‌కు వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ప్యాలెస్‌కు వెళ్తే శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందనే తాము అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. యలహంక ప్యాలెస్‌కు వెళ్లనీవకుండా షర్మిల వాహనాలను పోలీసులు డైవర్ట్‌ చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో లీలా ప్యాలెస్‌ హోటల్‌కు వైఎస్‌ షర్మిల వెళ్లారు.


రక్త సంబంధాలకు తిలోదకాలు ఇవ్వడం జగన్ రెడ్డికే చెల్లింది: షేక్ సైదా

బెంగళూరు ఎయిర్ పోర్టులో వైఎస్ షర్మిలా రెడ్డిని, వైఎస్ విజయలక్ష్మిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఏపీసీసీ అధికార ప్రతినిధి షేక్ సైదా తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి కష్టార్జితంతో నిర్మించిన ఇంటికి వైఎస్ విజయలక్ష్మి, షర్మిల వెళ్లనీవకుండా అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. జన్మనిచ్చిన తల్లి విజయలక్ష్మికి, తోడపుట్టిన చెల్లి షర్మిలకి కన్నీటి ధారలకు జగన్ మోహన్ రెడ్డి కారకుడు కావడాన్ని సభ్య సమాజం ఈసడించుకుంటోందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తన మేనకోడలు అంజలి వివాహం సందర్భంగా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సమంజసం కాదని చెప్పుకొచ్చారు. కోర్టులను, చట్టాలను అడ్డంపెట్టి బంధాలను, అనుబంధాలను, రక్త సంబంధాలకు తిలోదకాలు ఇవ్వడం జగన్ రెడ్డికే చెల్లిందని ఆగ్రహించారు. మేనకోడలు అంజలి వివాహాన్ని దగ్గరుండి ఘనంగా జరిపించాల్సిన మేనమామ జగన్ ఈ విధంగా వ్యవహారించడం సమంజసం కాదని షేక్ సైదా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 09:48 PM