Share News

స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం: దేవినేని ఉమా

ABN , Publish Date - Oct 21 , 2026 | 05:42 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సరికొత్త డ్రామాలకు తెరలేపారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం: దేవినేని ఉమా
TDP Leader Devineni Uma

అమరావతి, అక్టోబర్ 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సరికొత్త డ్రామాలకు తెరలేపారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 90 శాతానికి పైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బుధవారం రాజధాని అమరావతిలో దేవినేని ఉమా విలేకర్లతో మాట్లాడుతూ. నామినేషన్ పత్రాలను తామే చింపుకొని పోలీసులు, ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. నామినేషన్లకు వెళ్తున్నారా? యుద్ధానికి వెళ్తున్నారా? పోలీసులపై దాడులు చేయడం ఏ సంస్కృతి? అంటూ వారిని ప్రశ్నించారు.


సుప్రీంకోర్టు ఆదేశాలపై వైసీపీ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. వక్రభాష్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేయాలని మాత్రమే ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. కోర్టుల తీర్పులపై కూడా వక్రభాష్యాలు చెబుతూ ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తున్నారంటూ వైసీపీ మీడియాపై నిప్పులు చెరిగారు. దర్శిలో మహిళా కానిస్టేబుల్, ఎస్సైల తలలు పగలగొట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లోనే విధ్వంసం సృష్టించి.. దానిని ప్రభుత్వంపై నెడుతున్నారంటూ వైసీపీ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.


పులివెందులలో కిందిస్థాయి నేతలను నామినేషన్లు వేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ బతిమాలుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే హక్కు ఉందని అన్నారు. వామపక్షాలు ఇండిపెండెంట్లు స్వేచ్ఛగా వేస్తున్నారని చెప్పారు. గతంలో డీఎస్సీపై 300 కోర్టు కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. అయినా మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో 16 వేల ఉద్యోగాలిచ్చామని వివరించారు.


సీఎం చంద్రబాబు దూరదృష్టితో తెచ్చిన పట్టిసీమ, పురుషోత్తపట్నం నీళ్లే నేడు రాయలసీమ, విశాఖ, కృష్ణా డెల్టాలను కాపాడుతున్నాయని దేవినేని ఉమా పేర్కొన్నారు. పట్టిసీమ పంపులు పీకేస్తానని వైఎస్ జగన్ గతంలో అన్నారని గుర్తు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయన తాగుతున్నది పట్టిసీమ నీళ్లేనని ఈ సందర్భంగా వివరించారు. పోలవరం ఫేజ్-1 పనులతో పాటు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.


సూపర్ సిక్స్ హామీలతో రూ. లక్షన్నర కోట్ల సంక్షేమం, రూ.2 లక్షల కోట్ల అభివృద్ధిని పేదల ముంగిటకు తెచ్చామని చెప్పారు. గతంలో ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు నిలబెట్టి అవమానించిన చరిత్ర వైసీపీదని మాజీ మంత్రి దేవినేని ఉమా గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపే లక్ష్యం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం

For More AP News And Telugu News

Updated Date - Oct 21 , 2026 | 06:16 PM