విజయనగరం మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై ఎస్ఈసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Oct 21 , 2026 | 04:47 PM
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) రీ-షెడ్యూల్ చేసింది. అక్టోబర్ 28న జరగాల్సిన పోలింగ్‌ను అక్టోబర్ 29 (గురువారం)కు మార్చింది. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుందని స్పష్టం చేసింది.
అమరావతి, అక్టోబర్ 21: విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) రీ-షెడ్యూల్ చేసింది. అక్టోబర్ 28న జరగాల్సిన పోలింగ్‌ను అక్టోబర్ 29 (గురువారం)కు మార్చింది. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుందని స్పష్టం చేసింది. రాష్ట్ర పండుగ విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర (సిరిమాను ఉత్సవం) కారణంగా పోలింగ్ తేదీని మార్చినట్లు ఎస్ఈసీ వివరణ ఇచ్చింది.
అక్టోబర్ 26 తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమాను ఉత్సవానికి 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, పండుగ బందోబస్తుకు సిబ్బందిని కేటాయించాల్సిన పరిస్థితి ఉందని ఎస్ఈసీకి వివరించింది. అలాగే రవాణా సౌకర్యాలకు సంబంధించిన పలు ఇబ్బందుల దృష్ట్యా నగరపాలక సంస్థ పోలింగ్ తేదీని మార్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజయనగరం జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఇక అక్టోబర్ 30 (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి యథాతథంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అవసరమైతే అక్టోబర్ 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ-పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే అక్టోబర్ 30వ తేదీన రీ - పోలింగ్ అవసరమైతే.. అవి పూర్తయ్యే వరకు ఎన్నికల ఫలితాలు ప్రకటించకూడదని జిల్లా ఎన్నికల అధికారికి ఎస్ఈసీ స్పష్టంగా ఆదేశించింది. ఇతర పట్టణ స్థానిక సంస్థలతో పాటే అక్టోబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయనగరంలోనూ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి తెరపడనుంది.