CM Revanth Reddy: మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా.. మోదీ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 05 , 2025 | 05:34 PM
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.
వరంగల్, డిసెంబరు5 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు. తనకు వయస్సు ఉందని, ఓపిక ఉందని కేంద్రాన్ని నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(శుక్రవారం) నర్సంపేటలో సీఎం పర్యటించారు. రూ.508 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.
మళ్లీ అబద్దాలు చెబుతున్నారు..
‘జూబ్లీహిల్స్ ఎన్నిక రెఫరెండం అన్నోళ్లు ఇంట్లో పండుకోక మళ్లీ అబద్దాలు చెబుతూ తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారు. అభివృద్ధి జరగాలంటే మంచి సర్పంచ్‌ను ఎన్నుకోండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్వార్టర్‌కో, హాఫ్‌కో, పుల్లుకో ఓటు వేయొద్దు. ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయొద్దు, ప్రజల మనసుతో గెలవాలి. గ్రామాల్లో ఉండే యువకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేయండి. గ్రామాల్లో సర్పంచులు మంచోళ్లను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది. వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం మాజీ సీఎం కేసీఆర్ ఎనాడైనా ఆలోచించారా..? తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలన్నా ఆలోచన కేసీఆర్‌కు రాలేదు. మార్చి 31వ తేదీలోపు వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. గడీల పాలనను ప్రజలు కూలగొట్టారు. పదేళ్లలో గత పాలకులు మాత్రమే భారీగా ఆస్తులు సంపాదించారు. వాళ్లు ఆకాశానికి ఎదిగారు తప్ప.. ప్రజలను పట్టించుకోలేదు. వరి పండించండి.. ప్రతిగింజ మేం కొంటాం. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అందజేసిన తెలంగాణను.. కేసీఆర్ అప్పులపాలు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందజేశాం. వచ్చే ఏప్రిల్‌లోపు నర్సంపేటకు 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం..
‘హైదరాబాద్ స్థాయిలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం. రేషన్ ఇవ్వాలంటే గజ్వేల్‌లో ఫాంహౌస్ రాసిచ్చినట్లుగా కేసీఆర్ ఫీలయ్యారు. కోటి పది లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. మూడు కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. ఏపీ కంటే అధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు కానీ రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నాం. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో వరి పండించాలని చెప్పాం. ప్రపంచానికే పౌరుషాన్ని చాటిన వీరవనితలు సమ్మక్క - సారలమ్మ. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏ ఊళ్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో అక్కడే బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలి... మేము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన దగ్గర ఓట్లు అడుగుతాం. తరతరాలుగా కుల వృత్తుల బతుకులు మార్చలేదు... చదువు ఒక్కటే పిల్లల భవిష్యత్తు మార్చుతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆడబిడ్డలకు చీర, సారె అందజేస్తాం..
ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తాం. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఆడబిడ్డకు చీరలు అందిస్తున్నాం. కోటిమంది ఆడబిడ్డలకు చీర, సారె అందజేస్తాం. ఇందిరమ్మ చీరలకు ఎంత ఖర్చయినా భరిస్తాం. త్వరలో మహిళల ఉత్పత్తులు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు చేసేలా చర్యలు చేపడతాం. పేదబిడ్డలకు నాణ్యమైన చదువు అందించే బాధ్యత మాది. త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం. నిరుద్యోగులు బాగా చదవండి.. ఉద్యోగాలు సాధించండి. గ్రామాల్లో రాజకీయ కక్షలకు యువత బలికావొద్దు. గ్రామాల్లో రూ.20 వేల కోట్లతో రోడ్లు వేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
For More TG News And Telugu News